ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. శనివారం ( మే 23 ) వంశీ మోహన్ ను కోర్టు ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వంశీ మోహన్ నివాసంతో [పాటు 11 ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.
ఈ సోదాల్లో 19 ఖాళీ స్థలాల పత్రాల స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వనస్థలిపురం, మణికొండ, మజీద్‌బండలో ఇల్లు,ఫ్లాట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఇబ్రహీంపట్నం దగ్గర 2 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా గుర్తించారు అధికారులు. అంతే కాకుండా రూ. 2 లక్షల 10 వేల నగదు, 20 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కార్లతో సహా వంశీమోహన్ మొత్తం ఆస్తుల విలువ రూ.6.22 కోట్లుగా గుర్తించారు అధికారులు. 8 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. వంశీ మోహన్ కు పిగ్లిపురం ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో సహకరించిన అధికారులపై కూడా అరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ అక్రమాల్లో అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.
