మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి. గూడూరు మండలం అయోధ్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గూడూరు మండల విద్యాధికారి( MEO) రవీందర్, మరో స్కూల్ హెడ్మాస్టార్ రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
అయోధ్యాపురం పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ రవికుమార్.. ఒక పని నిమిత్తం 15 వేల రూపాయల లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు.. ఎంఈఓ రవీందర్, స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో వ్యక్తి ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు.
ప్రస్తుతం అయోధ్యాపురం పాఠశాలలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారుల వద్ద ఉన్న రికార్డులను, కీలక పత్రాలను ఏసీబీ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే అవినీతి చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
