రూ. 4 లక్షల లంచంతో దొరికిన సైబర్ సెక్యూరిటీ సీఐ... స్టేషన్ నుంచి పారిపోతుండగా వెంటాడి పట్టుకున్న ఏసీబీ

రూ. 4 లక్షల లంచంతో దొరికిన సైబర్ సెక్యూరిటీ సీఐ... స్టేషన్ నుంచి పారిపోతుండగా వెంటాడి పట్టుకున్న ఏసీబీ
  • నిందితుల కుటుంబసభ్యులను కేసులో ఇరికిస్తానని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్ కేసులో ఓ నిందితుడి వద్ద రూ.9 లక్షలు డిమాండ్
  • గతంలో రూ.5 లక్షల లంచం తీసుకున్న సీఐ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మిగిలిన రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత 
  • ఇంట్లో రూ.13 లక్షల నగదు, బంగారం, డాక్యుమెంట్లు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ క్రైమ్‌‌‌‌ కేసుల్లో నిందితులను బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌ చేసి దోచుకుంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌‌‌‌బీ) ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ‌‌‌‌మహేందర్‌‌‌‌‌‌‌‌ ఏసీబీకి చిక్కాడు. నిందితుడి కుటుంబసభ్యులను, స్నేహితులను కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ.. గతంలో రూ.5 లక్షలు తీసుకున్నాడు. శనివారం మరో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పారిపోతున్న మహేందర్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ అధికారులు వెంటాడి అరెస్ట్‌‌‌‌ చేశారు. లంచంగా తీసుకున్న రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం నాంపల్లిలోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌తో పాటు అల్వాల్‌‌‌‌లోని మహేందర్‌‌‌‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రూ. 13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, పలు ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మహేందర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్‌‌‌‌కు తరలించామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

నిందితుడిని బెదిరించి వసూళ్లు..  

నాంపల్లిలోని సైబర్‌‌‌‌ ‌‌‌‌సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్‌‌‌‌లో గతంలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫ్రాడ్‌‌‌‌ కేసు నమోదైంది. ఈ కేసులో ఇన్‌‌‌‌స్పెక్టర్ మహేందర్ నిందితుడిని అరెస్ట్‌‌‌‌చేసి రిమాండ్‌‌‌‌కు తరలించాడు. నిందితుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత బెదిరింపులు ప్రారంభించాడు. నిందితుడి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా కేసులో చేర్చుతానని బ్లాక్‌‌‌‌మెయిల్ చేశాడు. వాళ్లను కేసులో ఇరికించవద్దంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశాడు. ఈ మేరకు నిందితుడి తండ్రి నుంచి గతంలో రూ.2 లక్షలు, నిందితుడి నుంచి మరో రూ.3 లక్షలు తీసుకున్నాడు. 

మిగితా రూ.4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌‌‌‌ కేసును నమోదు చేసింది. బాధితుడితో కలిసి ట్రాప్ స్కెచ్ వేసింది. నాంపల్లి సైబర్ క్రైమ్ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా మహేందర్‌‌‌‌‌‌‌‌ను రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా అరెస్ట్‌‌‌‌ చేసింది. గతంలోనూ పలువురిని సైబర్ క్రైమ్‌‌‌‌ కేసుల్లో అరెస్ట్‌‌‌‌ చేస్తామని మహేందర్ బెదిరించి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.