రూ.30 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన బోయిన్‌‌‌‌ పల్లి ఎస్సై.. 

రూ.30 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన బోయిన్‌‌‌‌ పల్లి ఎస్సై.. 

పద్మారావునగర్, వెలుగు : పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు లంచం తీసుకున్న బోయిన్‌‌‌‌పల్లి ఎస్సై కిరణ్‌‌‌‌ నందితతో పాటు రైటర్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌‌‌‌ పరిధిలోని బోయిన్‌‌‌‌పల్లికి చెందిన అభిషేక్‌‌‌‌ అనే వ్యక్తిపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రతి సోమవారం బోయిన్‌‌‌‌పల్లి స్టేషన్‌‌‌‌కు హాజరై సంతకం చేయాలన్న నిబంధనతో అభిషేక్‌‌‌‌కు కోర్టు బెయిల్‌‌‌‌ మంజూరు చేసింది. దీంతో ప్రతి సోమవారం స్టేషన్‌‌‌‌కు వచ్చే అభిషేక్‌‌‌‌ను ఎస్సై కిరణ్‌‌‌‌ నందిత ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌‌‌‌లోనే కూర్చోబెట్టేవారు. 

ఈ క్రమంలో తాను గచ్చిబౌలికి మారుతున్నానని, స్టేషన్‌‌‌‌ హాజరు నుంచి మినహాయింపు ఇప్పించాలని అభిషేక్‌‌‌‌ రైటర్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను సంప్రదించాడు. అతడు ఎస్సైతో మాట్లాడుతానని చెప్పి రూ. 10 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎస్సై నేరుగా బాధితుడితో మాట్లాడి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్‌‌‌‌ చేశారు. దీంతో అభిషేక్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన ప్రకారం... అభిషేక్‌‌‌‌ బుధవారం డబ్బులు తీసుకొని బోయిన్‌‌‌‌పల్లి స్టేషన్‌‌‌‌కు వెళ్లి ఎస్సై నందితను కలిశాడు. 

ఆమె స్టేషన్‌‌‌‌ ఆవరణలో ఉన్న తన స్కూటీ తాళాలు ఇచ్చి, డిక్కీలో డబ్బులు పెట్టాలని సూచించింది. బాధితుడు డిక్కీలో డబ్బులు పెట్టి తాళాలు తిరిగి ఎస్సైకి ఇస్తుండగా, ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి ఎస్సై కిరణ్‌‌‌‌ నందితను, రైటర్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను పట్టుకున్నారు. లంచం సొమ్మును రికవరీ చేసి, స్కూటీని సీజ్ చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీధర్‌‌‌‌ వెల్లడించారు.