పశుసంవర్ధక శాఖలో ఏసీబీ కలకలం.. మంచిర్యాల ఏడీ శంకర్ ఆఫీస్, ఇంట్లో సోదాలు

పశుసంవర్ధక శాఖలో ఏసీబీ కలకలం.. మంచిర్యాల ఏడీ శంకర్ ఆఫీస్, ఇంట్లో సోదాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ శాఖ ఏడీ శంకర్  నివాసంతో పాటు కలెక్టరేట్​లోని ఆఫీస్​లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదిలాబాద్​ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో 10 గంటలకే రాంనగర్​లోని శంకర్​ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. అప్పటికీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. 11.30 గంటలకు మరికొందరు ఆఫీసర్లు కలెక్టరేట్​ ఫస్ట్​ ఫ్లోర్​లో ఉన్న జిల్లా వెటర్నరీ, యానిమల్​ హజ్బెండరీ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. 

ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీటింగ్​కు జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లంతా హాజరుకాగా, వారిని రాత్రి వరకు లోపలే ఉంచి విచారించారు. డిపార్ట్​మెంటల్​ తనిఖీల్లో భాగంగానే పశుసంవర్ధక శాఖ ఆఫీస్​తో పాటు ఏడీ శంకర్​ నివాసంలో సోదాలు నిర్వహించామని డీఎస్పీ మధు తెలిపారు. శంకర్​ ఇంట్లో నాలుగు ఫారిన్​ లిక్కర్​ బాటిల్స్​ సహా ఖరీదైన 42 మద్యం బాటిళ్లు లభించగా, ఎంక్వైరీ కోసం ఎక్సైజ్​ అధికారులకు అప్పగించామని తెలిపారు. 

రాత్రి 9 గంటల వరకూ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, శంకర్​ నివాసంలో భారీగా బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్టు తెలిసింది. ఇదిలాఉంటే జిల్లాలో పాతుకుపోయిన శంకర్​ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లకు పెండింగ్  బిల్స్​ రిలీజ్​ కాగా, అందులో 16 శాతం, ట్రాన్స్​పోర్ట్​ బిల్లులో 25 పర్సెంట్  కమీషన్లు డిమాండ్​ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో శంకర్​ అవినీతిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహించారని చర్చించుకుంటున్నారు.