సెల్ఫ్ డ్రైవింగ్​తో పెరుగుతున్న యాక్సిడెంట్లు..!

సెల్ఫ్ డ్రైవింగ్​తో పెరుగుతున్న యాక్సిడెంట్లు..!
  • సొంత కారున్నా దూర ప్రయాణాలకు డ్రైవర్లే బెటర్
  • నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలు బలి 

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రెగ్యులర్ గా జరుగుతున్న కారు యాక్సిడెంట్లలో ఎక్కువ మంది స్పాట్ లోనే చనిపోతున్నారు. అతి వేగం కారణంగా వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరగడం ఒక కారణమైతే, నిద్ర మత్తులో కారు నడపడం, తాగిన మత్తులో డ్రైవింగ్ చేయడం లాంటి కారణాలతో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత మధ్య తరగతి వాళ్లు కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంటే  భయపడుతూ తమ స్థోమతను బట్టి సొంత కార్లు కొనుక్కుంటున్నారు.  చాలా మంది డ్రైవర్లను పెట్టుకోకుండా  సొంతంగానే డ్రైవింగ్ చేయడం, సరైన ఎక్స్ పీరియన్స్ లేకుండానే సొంత కార్లలో లాంగ్ జర్నీలకు పోతుండడం  ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  

నాలుగు రోజుల క్రితం జనగామ జిల్లా లింగాల ఘనపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. హైదరాబాద్ లోని చందానగర్ కు చెందిన ఫ్యామిలీ జనగామ జిల్లా తిరుమలగిరిలో బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ కు చెందిన రఘురాంరెడ్డి (27) తన స్నేహితుడికి చెందిన కారును తల్లి, తండ్రితో కలిసి ఊరికి తీసుకొని వెళ్తుండగా, కారు వెనుక టైరు బరస్ట్ అయింది. వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయిన రఘురాం, ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఊహించని పరిస్థితిలో సీనియర్ డ్రైవర్ అయితే కారును కంట్రోల్ చేసే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొందరు డ్రైవర్లను తీసుకెళ్తున్నా, అర్ధరాత్రి ప్రయాణాలు చేయడం రిస్కీగా మారుతోంది. రెండు వారాల క్రితం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన కారు యాక్సిడెంట్ ఇలాంటిదే. 

మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో నిద్ర మత్తులో డ్రైవర్ కారు నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది. కరీంనగర్ కు చెందిన ముగ్గురు అన్నదమ్ములతో పాటు డ్రైవర్ స్పాట్ లో చనిపోగా, మరొకరికి సీరియస్ గా ఉంది. ఈ ఘటనలో రెగ్యులర్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సిరిసిల్ల జిల్లా లింగంపేటకు చెందిన టెంపరరీ డ్రైవర్ జలంధర్ ను తీసుకొని వెళ్లారు. కరీంనగర్ నుంచి ఉదయం బయల్దేరి దాదాపు 270 కిలోమీటర్లు జర్నీ చేసి కల్లూరు చేరుకోగా, మళ్లీ కల్లూరు నుంచి రాత్రి ప్రయాణం చేస్తుండడంతో అర్థరాత్రి 3 గంటల సమయంలో యాక్సిడెంట్ అయింది. 

పార్ట్ టైమ్ డ్రైవర్ కావడం ఒక కారణం కాగా, అర్ధరాత్రి నిద్రమత్తులో జర్నీ చేయడమే యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు అంచనా వేశారు. గతంలో ఎవరైనా ఫ్యామిలీ దూర ప్రయాణాలు చేయాలంటే కిరాయికి కారు మాట్లాడుకొని వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కార్లు కిరాయికి లభించడంతో పాటు, సొంతంగా డ్రైవింగ్ చేయాలనుకునే వారికి కాస్త ఎక్కువ రేటులో సెల్ఫ్ డ్రైవింగ్ కు కారు కిరాయి ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ లేకుండానే కార్లు వేసుకొని రోడ్లపైకి వచ్చి సొంత ఫ్యామిలీతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు. 

  • కారులో దూర ప్రయాణానికి సొంత డ్రైవింగ్ కంటే మంచి అనుభవం ఉన్న రెగ్యులర్ డ్రైవర్లను తీసుకెళ్లడం మంచిది.
  • పార్ట్ టైమ్ డ్రైవర్ ను తీసుకెళ్తున్నట్లయితే అతని డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి క్లారిటీ తీసుకున్నాకే వెహికల్ అప్పగించాలి. 
  • కారులో లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా టైర్ల కండిషన్, హెడ్ లైట్స్ ను నిపుణులతో చెక్ చేయించాలి.
  • కారు విండ్ షీల్డ్ పై క్రాక్స్ వచ్చినా, విజిబులిటీ సరిగ్గా లేకున్నా, ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఎఫెక్ట్ కు వ్యూ సరిగ్గా కనిపించకపోయినా విండ్ షీల్డ్ వెంటనే కొత్తది మార్పించాలి. 
  • కారు హెడ్ లైట్స్ విజిబులిటీ సరిగా లేకుంటే కొత్త హెడ్ లైట్స్ మార్పించాలి. 

ఎక్స్ పీరియన్స్ తోనే పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుంది

దాదాపు 20 ఏళ్ల పాటు లారీ డ్రైవర్ గా పనిచేశాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉండాలి. నిద్ర వస్తే కాసేపు వాహనాన్ని పక్కకు ఆపాలి తప్పించి అలాగే కంటిన్యూ చేయకూడదు. నడిపేది ఏ వాహనమైనా, సరైన అనుభవం ఉంటేనే యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవచ్చు.

– బొజ్జ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ లారీ డ్రైవర్, గుర్వాయిగూడెం.