- సూర్యాపేటలో వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడని ఆరోపణలు
- ఏలూరులో అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. కోదాడ వద్ద మృతి
కోదాడ, వెలుగు : వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైదాచారి (60)పై ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేసుకొని దోపిడీలు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధురాలు ఇరుగు పాపమ్మతో పరిచయం పెంచుకున్నాడు.
శనివారం పాపమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆమెను హత్య చేసి మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. వృద్ధురాలి హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి వృ-ద్ధురాలిని హత్య చేసి, బంగారం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారించగా.. చోరీ చేసిన బంగారాన్ని మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో తాకట్టు పెట్టి ఏపీలోని ఏలూరులో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో సూర్యాపేట పోలీసులు ఆదివారం ఏలూరు వెళ్లి సైదాచారిని అదుపులోకి తీసుకొని సూర్యాపేటకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే సైదాచారికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వెంటనే కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సైదాచారి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం కోసం సైదాచారి డెడ్‌బాడీని సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

