న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే రాజధాని నగరంలో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థినికి తెలిసిన వ్యక్తే ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వాయువ్య ఢిల్లీలోని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో ఆదివారం (అక్టోబర్ 26) ఉదయం చోటు చేసుకుంది.
ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. వాయువ్య ఢిల్లీలోని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో ఆదివారం (అక్టోబర్ 26) ఢిల్లీ యూనివర్శిటీలో సెకండియర్ చదువుతోన్న విద్యార్థినిపై యాసిడ్ జరిగింది. ఈ సంఘటన ఉదయం 10 గంటల ప్రాంతంలో కళాశాల క్యాంపస్‌కు కొద్ది దూరంలోనే చోటు చేసుకుంది. జితేందర్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ ఇషాన్, అర్మాన్‌లతో కలిసి బైక్‌పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ పోసి పారిపోయాడు.
ఈ ఘటనలో యువతి ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. బాధితురాలు ప్రస్తుతం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
యువతిపై యాసిడ్ దాడి చేసిన జితేందర్ ఆమెకు తెలిసిన వ్యక్తేనని.. ఇద్దరూ ముకుంద్‌పూర్ నివాసితులని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. జితేందర్ తనను వేధిస్తున్నాడని, దాదాపు నెల రోజుల క్రితం తమ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని బాధితురాలు దర్యాప్తు అధికారులకు తెలిపింది. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
