మల్కాజిగిరి మారుతినగర్ లో భార్యపై భర్త కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. బుధవారం ( జూన్ 10 ) ఉదయం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు అరుణ్ కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.భార్యపై అనుమానమే కాల్పులకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మారుతి నగర్ లో మహిళపై కాల్పులు జరిపినట్లు ఇవాళ ఉదయం ఐదున్నర, ఆరు గంటల సమయంలో డైల్ 100కి కాల్ వచ్చిందని... సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ వెహికల్ తో ఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు పోలీసులు.
మహిళపై మూడు రౌండ్ల కాల్పులు జరిగాయని... పోలీసులు వెళ్లే సమయానికి ఆమె రక్తపు మడుగుల్లో మహిళ చనిపోయి ఉందని తెలిపారు పోలీసులు. ఉదయం ఐదు గంటల సమయంలో తన కోడలు అత్త అత్త అంటూ అరిచినట్లు వినిపించిందని...వెళ్లి చూడగా అప్పటికే కోడలు మరణించిందని తెలిపారు అరుణ్ అమ్మ లక్ష్మి. అరుణ్ ఆరు గంటల సమయంలో పారిపోయాడని తెలిపారు లక్ష్మి.
నిందితుడు అరుణ్ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. అరుణ్ పై గతంలో కూడా అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ వెపన్ కేసులో అరెస్ట్ అయ్యాడని... నెల రోజులు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడని తెలిపారు పోలీసులు. కాల్పులు జరిపిన తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది... ఎందుకు చంపాల్సి వచ్చింది.. అనే వివరాలు అరెస్ట్ చేశాక తెలుస్తుందని అన్నారు పోలీసులు.
