అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ వార్నింగ్

అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ వార్నింగ్
  • అదనపు ఫీజులపై ఫిర్యాదు చేయాలని పేరెంట్స్కు సూచన
  • ఆయా కాలేజీలకు ఒక్కో విద్యార్థిపై రూ. 2 లక్షల ఫైన్ వేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్​ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో సాగుతున్న అదనపు ఫీజుల దందాపై తెలంగాణ అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సీరియస్​ అయింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించి విద్యార్థుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడితే.. ఆయా కాలేజీలకు ఒక్కో విద్యార్థిపై రూ. 2 లక్షల చొప్పున భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

వీ6– వెలుగు దినపత్రికలో సోమవారం ‘కన్వీనర్ కోటాకు అదనపు వసూళ్లు’ హెడ్​లైన్​తో ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్లు చేస్తున్న అక్రమ వసూళ్లపై కథనం ప్రచురితమైంది. సర్కారు నిర్ణయించిన ఫీజుతో పాటు వివిధ పేర్లతో ఒక్కో కాలేజీలో రూ.20వేల నుంచి రూ.50వేల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆధారాలతో సహా  వెల్లడించింది. దీనిపై సర్కారుతోపాటు టీఏఎఫ్ఆర్సీ సీరియస్ అయ్యాయి.

టీఏఎఫ్ఆర్సీ చైర్మన్  ఏ. గోపాల్ రెడ్డి ఆదేశాలతో కమిటీ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ జగన్ అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కాలేజీలకు వార్నింగ్ ఇస్తూ  మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, టెక్నికల్ ఎడ్యుకేషనర్​, జేఎన్టీయూ, ఓయూ రిజిస్ర్టార్లకూ లేఖ పంపించారు.

ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలి
 కొన్ని కాలేజీలు ట్యూషన్​ ఫీజు, అడ్మిషన్ ఫీజు, అక్రెడిటేషన్​ ఫీజు, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్​మెంట్ ఫీజు, యూనిఫామ్ ఫీజు.. ఇలా అనేక రకాలుగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయని, పేరెంట్స్ , స్టూడెంట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని కమిటీ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్  తన లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి వసూళ్లన్నీ పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చి చెప్పారు. వీటిని క్యాపిటేషన్ ఫీజుగానే పరిగణిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏ పేరుతోనైనా విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే హక్కు ఏ కాలేజీకీ లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలనీ, ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే ఆ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థిపై రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

పేరెంట్స్ ఫిర్యాదు చేయాలి..
 కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే విద్యార్థులు , తల్లిదండ్రులు తగిన ఆధారాలతో  నగరంలోని మాసబ్ ట్యాంక్​ లోని టీఏఎఫ్ఆర్సీ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఇప్పటికే పిల్లల నుంచి వసూలు చేసిన.. ఫీజులను వెనక్కి ఇప్పించేలా కాలేజీలకు ఆదేశాలివ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.