సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు, టాలీవుడ్ నటుడు సాయి శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పేశాడు. తిరుమల వెంకన్న సాక్షిగా వేదమంత్రాల మధ్య కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం రాత్రి 11 గంటల 5 నిమిషాలకు సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో తాళి కట్టాడు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయడు.. ఇతర సినీ రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పరిమిత సంఖ్యలో హాజరైన అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది. ఈ రిసెప్షన్కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కానుండటం గమనార్హం.
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. సనాతన ధర్మం, వైదిక పద్ధతుల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సన్నిధిలో.. శ్రీవారి ఆశీస్సులతో, అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ జంట ఒక్కటయింది.
ఇక.. బెల్లంకొండ శ్రీనివాస్ భార్య కావ్యా రెడ్డి నేపథ్యం ఏంటనే విషయానికొస్తే.. కావ్య రెడ్డి ఫ్యామిలీ హైదరాబాద్‌లో స్థిరపడింది. న్యాయవాదుల కుటుంబం. ఆమె తండ్రి ప్రముఖ అడ్వకేట్ కాగా, తాత జడ్జిగా పనిచేశారు. సినిమా రంగానికి ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సాయి శ్రీనివాస్‌తో ఆమెకు ఉన్న అనుబంధం పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు చేరింది.

