టాలెంట్ ఉంటే ఒక్క ఛాన్స్‌‌ ఇస్తానంటున్న నవదీప్

టాలెంట్ ఉంటే ఒక్క ఛాన్స్‌‌ ఇస్తానంటున్న నవదీప్
  • ప్లాట్ ఫాం ఏర్పాటు చేసిన నటుడు 
  • జూబ్లీహిల్స్ లో ఏర్పాటైన సీ స్పేస్

హైదరాబాద్, వెలుగు: సినిమా.. సినిమా.. సినిమా ఈ రంగుల ప్రపంచంలో తమదైన ముద్ర  వేసుకోవాలని కలలు కనేవారుఎందరో.  కృష్ణా నగర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్ లో చిన్న చిన్న గదుల్లో ఉంటూ స్టూడియోల చుట్టూ స్క్రిప్ట్  ఫైల్స్ పట్టుకుని తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఒక్క ఛాన్స్ అనే తిరిగేవారు కోకొల్లలు. అందరికీ ఆ అదృష్టం దక్కదు. టాలెంట్ ఉన్నా ఎలా రీచ్ అవ్వాలో తెలియక మిగిలిపోయినవారు అనేకులు. అలాంటి ఎంతో మంది టాలెంట్ పీపుల్ కోసం నటుడు నవదీప్ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అదే’సీ – స్పేస్'(కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్) సెంటర్

ఉగాది రోజు ప్రారంభం.

జూబ్లీహిల్స్ రోడ్ నెం .47లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో కో- ఫౌండర్స్ నవదీప్, పవన్ గోపరాజు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, సీఈఓ రాకేష్ రుద్రవంక పాల్గొన్నారు.  నవదీప్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్నవారి కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి సాయం లేకుండా డైరెక్టర్ తేజ అవకాశంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని, అందరికీ అటువంటి అవకాశం దొరకదని అటువంటి ఎంతోమందికి ఒక ప్లాట్ ఫాం కల్పించే ఉద్దేశంతోనే సీ స్పేస్ ని ఏర్పాటు చేశామన్నారు. బయట కాఫీ షాపుల్లో, స్టూడియోల చుట్టూ తిరిగేందుకు పెట్టే డబ్బుకంటే తక్కువ మొత్తంతో ఇక్కడ అనేక విషయాలు తెలుసుకుని టాలెంట్ నిరూపించుకోవచ్చన్నారు. ఉగాది రోజు నుంచి ఆన్‌‌లైన్‌‌లో మెంబర్‌‌షిప్‌‌ తీసుకొచ్చని, ఒక్కో మెంబర్ షిప్ కార్డ్ పై ఈ సెంటర్ లో 15 గంటలు స్పెండ్ చేయొచ్చన్నారు. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన 24 క్రాఫ్స్ట్ లో ఏది చేయాలనుకున్న తమవంతు సహకారం అందిస్తా మన్నారు. డైరెక్టర్‌‌ అవ్వాలనుకున్న వారిలో టాలెంట్ ఉంటే ప్రొడక్షన్ హౌజెస్ తో అప్రోచ్ అయి అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం  ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థతో అనుసంధానమయ్యామని  తెలిపారు. వీక్లీ వర్క్ షాప్స్, నిపుణులతో ఇంటరాక్షన్ ఉంటుందని, మూవీ ఆడిషన్స్, స్క్రిప్ట్ రైటింగ్,  డైరెక్షన్ లో మెళకువలు,  లైటింగ్, ఎడిటింగ్, థియేటర్ ప్రివ్యూ అన్ని ఒకే చోట అందుబాటులో ఉంచామన్నారు. ఒంటరిగా కూర్చుని  స్క్రిప్ట్ రాసుకునే వారికి ఇక్కడికి వస్తే ఇండస్ట్రీకి చెందిన నలుగురు పరిచయమవుతారు కాబట్టి టీం ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒక డెమో షూట్ చేసుకోడానికి కావలసిన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అందిస్తా మన్నారు.