
ఎవరో కొద్దిమంది తప్ప మిగతా హీరోలందరూ కమర్షియల్ సక్సెస్ కోసమే తపన పడుతుంటారు. మొదట్లో సూర్య కూడా అలాంటి హీరోనే అనిపించాడు. కానీ కొంతకాలంగా అతను చేస్తున్న ఎక్స్‌పెరిమెంట్స్ చూస్తుంటే తన రూటే సెపరేటు అనిపిస్తోంది. గతంలో ఎప్పుడైనా ఓసారి సుందరాంగుడు, శివపుత్రుడు లాంటి డిఫరెంట్ కాన్సెప్టుల్ని ఎంచుకునేవాడు. ఇప్పుడు మాత్రం వరుస ప్రయోగాలకు సిద్ధపడుతున్నాడు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు బాల డైరెక్షన్‌లో మరో వెరైటీ మూవీకి వర్క్ చేస్తున్నాడు. పదిహేడేళ్ల క్రితం వీళ్లిద్దరూ కలిసి ‘శివపుత్రుడు’ మూవీ చేశారు. అందులో సూర్యని ఒక డీగ్లామరస్ క్యారెక్టర్‌లో అత్యద్భుతంగా ప్రెజెంట్ చేశాడు బాల. ఈసారి కూడా అంచనాలకు అందని కొత్త తరహా పాత్రలో చూపించనున్నాడట. రీసెంట్‌గా కన్యాకుమారి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ముప్ఫై నాలుగు రోజుల పాటు అక్కడ ఇంపార్టెంట్ సీన్స్ తీశారు. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో మొదలు కానుంది. పదిహేను రోజుల పాటు జరిగే షూట్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. దాంతో ఈ సినిమాని సూర్య పక్కన పెట్టేశాడంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయ్యింది. ఈ చిత్రంలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.