రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళా మటోంద్కర్ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై ఊర్మిళ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటున్నారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే, ఆ వార్తలను ఖండించారు.
లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఊర్మిళ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.సమున్నత లక్ష్యం కోసం ముంబై కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఇష్టం లేనందున తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఊర్మిళ తెలిపారు.

