
- మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్‌మార్‌లో వాటాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్ అమ్మనుందనే వార్తలపై అదానీ గ్రూప్ స్పందించింది. అలాంటి ఆలోచన ఏం లేదని ప్రకటించింది. విల్‌మార్ ఇంటర్నేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ అదానీ విల్‌మార్ . మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్‌పై సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీ స్పందించాల్సి ఉందని, అందుకే ఈ అంశంపై క్లారిటీ ఇస్తున్నామని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం 6 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న అదానీ విల్‌మార్‌లో 44 శాతం వాటాను అదానీ గ్రూప్ అమ్మనుందని ఈ వారం ప్రారంభంలో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. గౌతమ్ అదానీ, అతని ఫ్యామిలీ కంపెనీలో మైనార్టీ వాటాను ఉంచుకోవచ్చని పేర్కొంది. ప్లాన్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని, అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన వాటాను అమ్మకపోవచ్చని కూడా బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. కాగా, అదానీ విల్‌మార్‌కు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.79 కోట్ల నష్టం వచ్చింది. వంట నూనె ధరలు తగ్గడంతో కంపెనీ రెవెన్యూ భారీగా పడింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో రూ.194 కోట్ల నికర లాభాన్ని అదానీ విల్‌మార్ ప్రకటించింది.