తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా..? పవన్ కల్యాణ్‎పై అద్దంకి దయాకర్ ఫైర్

తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా..? పవన్ కల్యాణ్‎పై అద్దంకి దయాకర్ ఫైర్

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‎పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం (జూన్ 2) అద్దంకి గాంధీ భవన్‎లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జనసేన సభతో పేరుతో వైషమ్యాలు సృష్టించాలని చూస్తారా..? తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా..? అని పవన్ కల్యాణ్‎ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసలు పవన్ కల్యాణ్‎కు తెలంగాణలో ఏం పని అని.. ఏపీలో మీ పాలన మీరు చూసుకోండని చురకలంటించారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి వెళ్లాక  నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని బీజేపీ చెప్పింది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‎ను తెలంగాణలో రంగంలోకి దించాలని కాషాయ పార్టీ చూస్తోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ బీజేపీ, సనాతన ధర్మం కోసం పని చేసే వ్యక్తి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు అన్నంత తినలే అని పవన్ కల్యాణ్ అన్నారు.

 ఇలా తెలంగాణపై నరనరాన విద్వేషం నింపుకున్న వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఊరుకుంటారా అని నిలదీశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ సభ పెడితే ప్రభుత్వం తిరస్కరించింది.. కనీసం ప్రెస్ మీట్‎కు అనుమతి అడుగుతున్నారు.. అది కూడా సాధ్యం కాదని చెబుతున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు జూన్ 2 పవిత్రమైన రోజు.. అలాంటి రోజు సభ పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే హక్కు పవన్‎కు లేదని అన్నారు. 

తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ పవన్‎ను వాడుకుంటోందని అన్నారు. పవన్ కళ్యాణ్‏ను బలి పశువును చేయొద్దని బీజేపీకి చెబుతున్నా.. ఆయనకు రాజకీయం తెలియదన్నారు. బీజేపీ అంటేనే విష కౌగిలి.. ఆ పార్టీ వలలో పడొద్దని పవన్‎కు సూచిస్తున్నానని అన్నారు. పవన్ చరిష్మాపై మాకేం భయం లేదని.. ఆయనకు బలం లేకనే డిప్యూటీ సీఎం అయ్యాడని అన్నారు. పవన్ కల్యాణ్ మీటింగ్‎పై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటే సైలెంట్‎గా ఉంటారా అని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, ఆయన పరివారం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.