- విప్ అద్దంకి దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదని విప్ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఓజీ నాయకుడు కాదని, నాజీ నాయకుడు అవుదామని అనుకున్నారని, కానీ, రాజీ నాయకుడు అయ్యారని చురకలంటించారు. ఈ మేరకు బుధవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తురుపు ముక్క కాదు..కలుపు మొక్క అని విమర్శించారు.
లీడర్ లెస్ పార్టీగా బీఆర్ఎస్ కనిపిస్తుందని ఆరోపించారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉండటంతోనే బలుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను జలగల్లా దోచుకున్న బీఆర్ఎస్ నాయకులను ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగుల్లోనూ తెలంగాణ ఉద్యమకారులు
మాదాపూర్, వెలుగు : తెలంగాణ రాష్ర్ట సాధనలో ఐటీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడిగా ఉన్న అద్దంకి దయాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ రంగ ప్రతినిధుల వివరాలను సేకరించి ప్రభుత్వ కమిటీకి సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. ఇందుకు టిటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
