- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: జనసేన చీఫ్పవన్ కల్యాణ్ కు తెలంగాణపై ఎంత ప్రేముందో.. ఆయన కామెంట్లలోనే స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ పేరు ఎత్తడానికే ఇబ్బంది పడుతున్న మీరు, మీ విధానం ఏంటో తెలియనంత అమాయకులు ఇక్కడి ప్రజలు కాదు.
మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ఇవ్వడాన్ని మీరు ఎలా వ్యతిరేకించారో అందరికి తెలుసు. అసలు తెలంగాణ అస్తిత్వం తెలియని మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. గద్దర్ పేరు ప్రస్తావించి తెలంగాణ ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని.. కానీ, ఇక్కడి ప్రజలు మిమ్మల్ని నమ్మరని పవన్ కు అద్దంకి స్పష్టం చేశారు.
