కొత్త గూటికి.. చిట్టి అడుగులు!..అనాథ పిల్లల దత్తతకు ముందుకొస్తున్న దంపతులు

కొత్త గూటికి.. చిట్టి అడుగులు!..అనాథ పిల్లల దత్తతకు ముందుకొస్తున్న దంపతులు
  • ఈ ఏడాది రికార్డు స్థాయిలో 307 మంది చిన్నారుల అడాప్షన్
  • 29 మంది  స్పెషల్ నీడ్స్​ పిల్లలను చేరదీసిన విదేశీయులు
  • పదేండ్లలో ఎన్నడూలేని విధంగా పెరిగిన అడాప్షన్లు 
  • వచ్చే ఏడాది 350 మంది పిల్లల దత్తతే లక్ష్యంగా డబ్ల్యూసీడీ అధికారుల చర్యలు

హైదరాబాద్, వెలుగు: కన్నవారు లేని పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దొరికితే.. పిల్లలు లేని దంపతులకు ఆ బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు చేరువైతే ఆ సంతోషానికి అవధులు ఉండవు కదు.. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతోంది. శిశు గృహాల్లో మగ్గుతున్న అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకునేందుకు పిల్లలు లేని దంపతులు ముందుకొస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది 307 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు.

మంచిగున్న పిల్లల్నే కాదు.. స్పెషల్ నీడ్స్ పిల్లలను కూడా దత్తత తీసుకోవడానికి ముందుకొస్తుండడం విశేషం. ఇదివరకు దత్తతపై సమాజంలో చిన్నచూపు ఉండేది. గత కొన్నేండ్లుగా ఆ చిన్నచూపు, అపోహలు ప్రజల్లో తొలిగిపోతున్నాయి. దీంతో కొన్నేండ్లుగా చట్టబద్ధంగా దత్తత తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గత పదేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈసారి దత్తత తీసుకున్నవారి సంఖ్య పెరగడం విశేషం.

ఏటా పెరుగుతున్న గ్రాఫ్.. 

రాష్ట్రంలో అడాప్షన్ల గ్రాఫ్ ఏటా పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది దత్తత తీసుకున్న 307 మందిలో.. 277 మంది చిన్నారులను మన దేశంలోని దంపతులే దత్తత తీసుకున్నారు. వారిలో 44 మంది పదేండ్లకు పైబడిన వారు ఉన్నారు. మరో 30 మంది చిన్నారులను విదేశాల్లో నివసిస్తున్న వారు దత్తత తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరూ ముందుకురాని 29 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా మనసున్న దంపతులు ప్రేమగా అక్కున చేర్చుకోవడం విశేషం. మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న స్పెషల్ నీడ్స్ పిల్లలను కూడా దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన దంపతులకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. అయితే, స్పెషల్ నీడ్స్ పిల్లలను దత్తత తీసుకున్నవారిలో మెజారిటీ సభ్యులు విదేశీయులు ఉండటం గమనార్హం. 

ముందుకొస్తున్న దంపతులు.. 

చట్టబద్ధమైన దత్తతకు గతంలో దంపతులు మొగ్గుచూపేవారు కాదు. దీంతో అనాథ పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కోసం ఏండ్ల తరబడి వేచి చూసేపరిస్థితి ఉండేది. అయితే, కొన్నేండ్లు దత్తతపై ఉన్న అపోహలు, చిన్నచూపు తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అడాప్షన్లు తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. అక్రమ పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకోవడం నేరమని, చట్టబద్ధంగానే దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 55 అడాప్షన్ హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఈ డెస్కులు దంపతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. వచ్చే ఏడాదికి కనీసం 350 మంది చిన్నారులను దత్తత ఇచ్చి, వారికి తల్లిదండ్రుల ప్రేమను అందించడమే లక్ష్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

రాష్ట్రంలో దత్తతల గ్రాఫ్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది

ఆర్థిక సంవత్సరం    దత్తత తీసుకున్న చిన్నారుల సంఖ్య
2014 - 15                                         150 మంది
2023 - 24                                          166 మంది
2024 - 25                                          220 మంది
2025 - 26 (ఈ ఏడాది)                      307 మంది