లాయర్లకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంది?
వామన్‌రావు దంపతుల హత్య వెనుక ఎవరున్నా శిక్షించాల్సిందే
కేసును సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి.. సీఎం స్పందించాలి: అడ్వకేట్లు
బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ‘చలో గుంజపడుగు’
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో రాక్షస రాజ్యం కొనసాగుతోందని, న్యాయాన్ని కాపాడే తమకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని లాయర్లు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే సీఎం ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని, గూండాలు రాజరికం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యల వెనుక ఎవరున్నా శిక్షించాల్సిందేనని, కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. వామన్‌రావు, నాగమణి కుటుంబాన్ని పరామర్శించడానికి బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘చలో గుంజపడుగు’ చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ కోర్టుల నుంచి సుమారు 200 మంది లాయర్లు ఇందులో పాల్గొన్నారు. మొదట వారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద వామన్ రావు దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
అక్కడి నుంచి మంథని చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఆ తర్వాత వామన్‌రావు సొంతూరు గుంజపడుగుకు చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ లీగల్‌సెల్ రాష్ట్ర కన్వీనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. లాయర్ దంపతులను నడి రోడ్డుపై హత్య చేశారంటే రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఎలాంటి పరిస్థితిలోకి చేరిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వామన్ రావు, నాగమణి దంపతుల కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు రాష్ట్రంలోని లాయర్లకు భరోసా కల్పించడానికే తాము ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే సీఎం ఫాంహౌస్‌లో ఉంటే.. గూండాలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ స్పందించి హత్యల వెనుక ఉన్న బడాబాబులకు శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. హైకోర్ట్ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లు సిరికొండ సంజీవరావు, హన్మంత్ రెడ్డి, గోకుల రామారావు, ఆకుల యుగేందర్, పీఠం ప్రదీప్, ఆంజనేయులు, పల్లవి, రజిత, ప్రసన్న, బీజేపీ మంథని ఇన్చార్జ్ రేండ్ల సనత్ కుమార్ పాల్గొన్నారు.
కేసీఆర్ కామెంట్లే కారణం: రాజాసింగ్
హైదరాబాద్ , వెలుగు: హాలియా సభలో సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా చేసిన కామెంట్లే లాయర్ దంపతుల హత్యలకు కారణమని, ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే లాయర్లను హత్య చేయడం దారుణమని, ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో గుంజపడుగు’ బస్సు యాత్రను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద రాజాసింగ్ ప్రారంభించి మాట్లాడారు. హత్యలకు పాల్పడిన వారిని , వీటి వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం ఫాంహౌజ్ లో పడుకుంటే గూండాలు రాష్ట్రాన్ని ఏలుతున్నారని బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్ర అన్నారు.

