V6 News

మళ్లీ ట్రాక్‌లోకి విశ్వక్ సేన్.. 'దేవర' మేకర్స్‌తో రొమాంటిక్ కామెడీ మూవీ లాంచ్!

మళ్లీ ట్రాక్‌లోకి విశ్వక్ సేన్.. 'దేవర' మేకర్స్‌తో రొమాంటిక్ కామెడీ మూవీ లాంచ్!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరింత జోరు పెంచారు.  వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో నటించిన ' ఫంకీ' మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో మరో ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్‌తో గ్లోబల్ హిట్ 'దేవర'ను నిర్మించిన యువసుధ ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు విశ్వక్ సేన్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించింది.

దేవర నిర్మాణ సంస్థలో విశ్వక్ ఎంట్రీ!

యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదట అల్లు అర్జున్-కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, ఆ తర్వాత 'దేవర'తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 'దేవర 2' పనులు ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో వైవిధ్యమైన సినిమాలు తీయాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే విశ్వక్ సేన్‌ను ఎంపిక చేసుకున్నారు.

గ్రాండ్‌గా లాంచ్.. కొరటాల శివ క్లాప్!

సోమవారం  ( ఏప్రిల్ 10న )  హైదరాబాద్‌లో ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొరటాల శివ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. యువసుధ ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ కామెడీతో రజత్ రవిశంకర్!

ఈ సినిమాకు తమిళ దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో కార్తీ హీరోగా 'దేవ్' (2019) చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం ఒక ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రం 'ఫంకీ' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

కొరటాల నెక్స్ట్ ఏంటి?

దేవర రిలీజ్ తర్వాత కొరటాల శివ తదుపరి అడుగుపై ఇంకా స్పష్టత రాలేదు. దేవర సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది? లేదా ఈలోపు వేరే చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే, తన హోమ్ బ్యానర్ లాంటి యువసుధ ఆర్ట్స్ ప్రాజెక్టులకు ఆయన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ ఎనర్జీకి రజత్ రవిశంకర్ స్టైలిష్ మేకింగ్ తోడైతే, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.