ఢిల్లీ పోలీసులపై ఆఫ్రికన్ల దాడి

ఢిల్లీ పోలీసులపై ఆఫ్రికన్ల దాడి
  • చుట్టుముట్టి ఎటాక్​ చేసిన వంద మంది
  • వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్ల అరెస్టు
  • మా వాళ్లనే అరెస్టు చేస్తారా అంటూ అడ్డగింత
  • ఇద్దరిని తప్పించిన ఆఫ్రికన్లు

న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను యాంటీ డ్రగ్​ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారిని పోలీస్ స్టేషన్​కు తరలించేందుకు రెడీ అయ్యింది. తమ వాళ్లను అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న వంద మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టుముట్టారు. వారిని తప్పించేందుకు పోలీసులపై దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులను అటకాయించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెబ్​సరాయ్​ ఏరియాలో జరిగింది. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వీసా ఎక్స్​పైర్​ అయినోళ్లను గుర్తించి తిరిగి వారి దేశం పంపించేందుకు సీనియర్ అధికారులతో కూడిన నార్కోటిక్​ సెల్​ టీం 2.30 గంటలకు నైజీరియన్లు ఉంటున్న నెబ్ సరాయ్ లోని రాజు పార్క్​కు వెళ్లింది. ముగ్గురి వీసాలు ఎక్స్​పైర్ అయినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. ఇది తెలుసుకున్న వంద మంది ఆఫ్రికన్లు పోలీసులను రౌండప్​ చేసి దాడికి పాల్పడ్డారు. ముగ్గురు నైజీరియన్లను విడిపించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిలో ఇద్దరు పారిపోగా.. 22 ఏండ్ల 
ఫిలిప్ పోలీసులకు దొరికిపోయాడు.

రెండో సారి నలుగురి అరెస్టు.. 

ఆఫ్రికన్ల దాడి విషయం తెలుసుకున్న నార్కోటిక్ స్క్వాడ్​ టీం, నెబ్ సరాయ్​ పోలీసులతో కలిసి మళ్లీ సాయంత్రం 6.30 గంటలకు రాజు పార్క్​కు వెళ్లింది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకుంది. పోలీసులు మళ్లీ వచ్చారని తెలుసుకున్న ఆఫ్రికన్లు.. ఈసారి ఏకంగా 150 నుంచి 200 మంది అక్కడికి వచ్చి పోలీసులను రౌండప్​ చేశారు. నలుగురు ఆఫ్రికన్లను తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అతికష్టం మీద నలుగురిని నెబ్ సరాయ్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. వీరిని ఆఫ్రికాకు పంపించేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నలుగురిని కెనే చుక్వు డేవిడ్ విలియమ్స్, ఇగ్వే ఇమ్మాన్యుయేల్ చిమెజీ, అజీగ్బే జాన్, క్వీన్ గాడ్విన్​గా పోలీసులు గుర్తించారు.

నైజీరియన్లపై కేసులు

పట్టుబడిన నైజీరియన్లపై ఐపీసీ సెక్షన్ 420/120 బి తో పాటు ఫారినర్స్​ యాక్ట్​ సెక్షన్​ 14 కింద క్రైం బ్రాంచ్​ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.