న్యూఢిల్లీ: ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెరగడంతో ఇబ్బందిపడుతున్న వినియోగదారులకు త్వరలో కరెంట్ షాక్ తగలనుంది. కరెంట్ వాడకంతో సంబంధం లేకుండా ప్రతి నెలా చెల్లించాల్సిన 'ఫిక్స్‌డ్ ఛార్జీల' పెంపునకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా కొన్ని ప్రతిపాదనలు చేసింది.
పరిశ్రమలు, ధనవంతులు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్స్‌కు మారుతుండటంతో కరెంట్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) ఆదాయం దెబ్బతింటోంది. డిస్కమ్‌ల మొత్తం ఖర్చులలో ట్రాన్స్‌మిషన్, సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ వంటి ఫిక్స్డ్ ఖర్చులు 38శాతం నుంచి 56శాతం వరకు ఉంటుండగా, ఫిక్స్‌డ్ ఛార్జీల ద్వారా కేవలం 9శాతం నుంచి 20శాతం ఆదాయం మాత్రమే వస్తోంది.
ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి వచ్చే స్థిరమైన ఆదాయాన్ని 25 శాతానికి, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయాన్ని 100 శాతానికి దశలవారీగా పెంచాలని సీఈఏ సూచించింది. కాగా, మనం కరెంట్ వాడినా, వాడకపోయినా (మీటర్ రీడింగ్ '0' ఉన్నప్పటికీ) కనెక్షన్ ఉన్నందుకు ప్రతి నెలా విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన కనీస రుసుమునే ఫిక్స్‌డ్ ఛార్జీలు అంటారు.
ప్రస్తుతం మనం కట్టే బిల్లులో ఎక్కువ భాగం మనం వాడిన యూనిట్ల బట్టే ఉంటోంది. మరోవైపు రూఫ్‌టాప్ సోలార్, నెట్-మీటరింగ్ వాడుతున్న వారి కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని కూడా సీఈఏ సిఫార్సు చేసింది.
