ఆధ్యాత్మిక కేంద్రంగా అగస్త్య గుండం.. రూ.17 కోట్లతో అభివృద్ధికి మంత్రి వివేక్ చొరవ 

ఆధ్యాత్మిక కేంద్రంగా అగస్త్య గుండం.. రూ.17 కోట్లతో అభివృద్ధికి మంత్రి వివేక్ చొరవ 
  •      గోదావరి పుష్కరాల నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక 
  •      ఆకట్టుకుంటున్న ఆర్కిటెక్చర్​ డిజైన్లు
  •      పర్యాటకంగానూ అలరించనున్న ప్రాంతం


 
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​ నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం, ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రెడీ అయ్యింది. పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు నడుమ నీళ్లు, పచ్చని చెట్లు, ప్రకృతి సోయగంతో కనువిందు చేస్తున్న ఈ ఆలయాన్ని చెన్నూరుకే వన్నె తెచ్చేలా రూ.17 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఏడాది జులైలో జరుగనున్న గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తిచేసి పర్యాటకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా చెన్నూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తన ధ్యేయమని స్థానిక​ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి​ డాక్టర్ ​జి.వివేక్​ వెంకటస్వామి పేర్కొంటున్నారు. 

చారిత్రక ప్రాశస్త్యం

చెన్నూరులో అగస్త్యేశ్వరస్వామి ఆలయం, దాని పక్కనే పెద్ద చెరువులోని అగస్త్య గుండం ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సప్త రుషుల్లో ఒకరైన అగస్త్య మహాముని చెన్నూరు​ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా పెద్ద చెరువులోని అగస్త్య గుండంలో స్నానం చేసి అగస్త్యేశ్వర ఆలయంలో పూజలు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.  చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అగస్త్య గుండం ఆనవాళ్లు లేకుండా పోతోందని భావించిన మాజీ ఎంపీపీ మైదం సత్యనారాయణ 2006లో తన సొంత ఖర్చుతో అగస్త్య గుండం, ఆలయంతో పాటు భారీ శివలింగాన్ని నిర్మించారు. పెద్ద చెరువు కట్ట పైనుంచి గుండం వద్దకు వెళ్లడానికి బ్రిడ్జి ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం పర్యాటకులతో ఎంతో రద్దీగా ఉండేది. ఇక్కడ సినిమా షూటింగులు సైతం జరిగాయి. కానీ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండగానే సత్యనారాయణ మరణించారు. దీంతో పనులు పూర్తి కాకపోవడంతో అగస్త్య గుండం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది.

ఆకట్టుకుంటున్న డిజైన్లు

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో అగస్త్య గుండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్లాన్ తయారు చేశారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.17 కోట్లు సాంక్షన్​ చేసింది. చెన్నూరుకు చెందిన యువ ఆర్కిటెక్ట్​ తిరుపతి విష్ణు రూపొందించిన డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. చెరువు నడుమ గల శివలింగం మినహా మిగతా నిర్మాణాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్తగా నిర్మించనున్నారు. భవిష్యత్​లో పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున శివలింగం వద్ద గల ఐలాండ్​ను మరింత విశాలంగా మార్చనున్నారు. చెన్నూరు​ చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేసేలా కల్చరల్​ సెంటర్, ఆడిటోరియం, చిల్డ్రన్స్​ప్లే ఏరియాతో పాటు ఫుడ్​కోర్టులు, ఇతర స్టాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

పంచక్రోశ ఉత్తరవాహిని..

చెన్నూరు పట్టణ శివారులోని గోదావరి నది పంచక్రోశ ఉత్తరవాహినిగా ప్రసిద్ధి చెందింది. గోదావరి నది ఉత్తరం దిశగా 5 కిలోమీటర్లు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఉత్తరవాహినిలో స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో దశాబ్దాల కాలంగా చెన్నూరు ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. తమ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే కాశీకి వెళ్లలేని భక్తులు చెన్నూరు గోదావరిలో అస్థికలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.