చరిత్ర చెరిగిపోతోంది

చరిత్ర చెరిగిపోతోంది
  • భద్రాద్రి కొత్తగూడెంలో శిథిలావస్థలో బౌద్ధ నిర్మాణాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని బౌద్ధ నిర్మాణాలు క్షుద్ర పూజలకు నిలయాలుగా మారాయి. శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో గల ఈ బౌద్ధ నిర్మాణాలను ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​మూడున్నర దశాబ్దాల కిందట గుర్తించింది. నిర్మాణాల చుట్టూ సగం మేర ఫెన్సింగ్​ వేసి వదిలేయడంతో వాటికి రక్షణ కరువైంది. మహాయాన బౌద్ధానికి చెందిన ఈ నిర్మాణాలు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో కారుకొండ ప్రాంతంలోని గుట్టల్లో ఉన్నాయి. మూడు, నాలుగో శతాబ్దంలో బౌద్ధ బిక్షువులు ఈ ప్రాంతంలో ధ్యానం చేసిన ఆనవాళ్లున్నాయని ఆర్కియాలజిస్టులు 1986వ సంవత్సరంలో గుర్తించారు. రెండు రాతి గుహలు, ఏకశిలపై నాలుగు వైపులా బుద్ధుడి బొమ్మలు చెక్కి ఉన్నాయి. రాతి గుహల్లో బౌద్ధ బిక్షువులు ధ్యానం చేస్తున్నట్టు చిత్రాలున్నాయి. కొండను తొలచి ఈ రాతి గుహలను నిర్మించారు. మహాయాన బౌద్ధానికి చెందిన ఇటువంటి నిర్మాణాలు జిల్లాలో మరెక్కడా లేవు. ఆర్కియాలజిస్టులు ఈ గుహలను చారిత్రక ప్రాంతాలుగా గుర్తిస్తూ కొంతమేర ఐరన్​ఫెన్సింగ్​వేసి చేతులు దులుపుకొన్నారు. నాటి నుంచి ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకున్నవారే కరువయ్యారు. 
గుట్టపై అక్రమ తవ్వకాలు
పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీఆర్ఎస్​సర్కారు చెబుతున్న మాటలు ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మూడు, నాలుగో శతాబ్దానికి చెందిన ఈ బౌద్ధ నిర్మాణాలను పాలకులతో పాటు ఆఫీసర్లు చిన్నచూపు చూస్తున్నారని బౌద్ధ మతానికి చెందినవారితో పాటు అహింసావాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాలున్న గుట్టను కొందరు వ్యక్తులు అక్రమంగా తవ్వుతున్నారు. పెద్దఎత్తున గుట్టపై తవ్వకాలు జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు గుప్త నిధులున్నాయనే ప్రచారంతో బౌద్ధ నిర్మాణాలున్న ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు అమావాస్య, పౌర్ణమి ఇతరత్రా రోజుల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. బౌద్ధ బిక్షువులు నివసించిన ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు, జంతుబలులు యథేచ్ఛగా సాగుతుండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన మహాయాన బౌద్ధ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్ ​పెట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

బౌద్ధ నిర్మాణాలు పరిరక్షించాలె
కారుకొండ అటవీ ప్రాంతంలోని బౌద్ధ నిర్మాణాల పరిరక్షణకు గవర్నమెంట్​ చర్యలు చేపట్టాలని బౌద్ధ బిక్షువు బంతె సద్దా రక్కిత కోరారు. కారుకొండ అటవీ ప్రాంతంలోని బౌద్ధ నిర్మాణాలను వరంగల్​ డివిజన్​ఆర్కియాలజిస్ట్​ మల్లు నాయక్​తో కలిసి ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసామూర్తి అయిన బుద్ధుడి చెంత క్షుద్రపూజలు, జంతుబలులు చేయడం దారుణమన్నారు. జిల్లాలోనే ఏకైక బౌద్ధ నిర్మాణాలు గల ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​ గుర్తించినప్పటికీ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిర్మాణాలు శిథిలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్కియాలజిస్ట్​ మల్లునాయక్​ మాట్లాడుతూ బౌద్ధ బిక్షువు కంప్లైట్​ మేరకు తాము ఇక్కడకు వచ్చామన్నారు. ఇక్కడున్న పరిస్థితి, బౌద్ధ నిర్మాణాల రక్షణపై కలెక్టర్​తో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. వారి వెంట బౌద్ధ బిక్షువు ధర్మరాజు, డాక్టర్​ఉమ్మడి ఇన్నయ్య, గుగులోత్​ శ్రీనివాస్​ ఉన్నారు.


కేంద్రమంత్రి కిషన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తా  
కొత్తగూడెం పట్టణానికి కూతవేటు దూరంలో గల బౌద్ధ నిర్మాణాల పరిరక్షణ, అభివృద్ధి విషయమై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డితో మాట్లాడతా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నావంతు కృషి చేస్తా. ఆర్కియాలజీ ఆఫీసర్లు బౌద్ధ నిర్మా ణాలకు సంబంధించిన పూర్తి వివ రాలను నాకు అందజేస్తే కిషన్​రెడ్డికి ఇస్తాను. కలెక్టర్​ ఈ నిర్మాణాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి 
                                                                                                                                                                    - కోనేరు సత్యనారాయణ, బీజేపీ ప్రెసిడెంట్,కొత్తగూడెం జిల్లా