ట్రంప్‌ ఇండియా పర్యటన.. మురికివాడ కనిపించకుండా గోడ

ట్రంప్‌ ఇండియా పర్యటన.. మురికివాడ కనిపించకుండా గోడ

త్వరలో భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మురికివాడలు కంటపడకుండా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వింత నిర్ణయం తీసుకుంది. ఆయన ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న ఓ స్లమ్ కనిపించకుండా అడ్డంగా గోడ కడుతోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు రోడ్డు పక్కన చిన్న చిన్న రేకుల ఇళ్లు, పూరి గుడిసెలతో కూడిన మురికివాడ ఉంది. అవేవీ ట్రంప్ కారులో వెళ్లేటప్పుడు కనిపించకుండా ఎత్తుగా గోడ నిర్మిస్తున్నారు అధికారులు. ఈ చర్యపై ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. గోడలు కట్టడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుతో ఆ మురికివాడలను అందంగా తీర్చిదిద్దవచ్చని విపక్ష నేతలు అంటున్నారు. ప్రభుత్వం అనవసరంగా ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గోడ నిర్మాణం విషయం తనకు తెలియదని చెబుతున్నారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బిజల్ పటేల్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరి వారంలో భారత పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన లాండ్ అవుతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి అక్కడి నుంచి కారులో అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, ట్రంప్ పాల్గొంటారు. రెండో రోజు ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు.