హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేనని.. ఒకరేమో సెక్రటేరియట్‌ను కూలుస్తానంటే, ఇంకొకరు పార్లమెంట్‌ను కూల్చాలని చూస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రామచంద్ర కుంతియా ఎద్దేవా చేశారు. ప్రధాని బడేభాయ్లా, సీఎం ఛోటేభాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు చెప్పినా కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్య, ఆందోళనలతో ఇప్పటికే 20మందికి పైగా కార్మికులు చనిపోయారని చెప్పారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను కుంతియా ఖండించారు. మెజారిటీ రైతులకు ఇప్పటికీ రైతుబంధు పథకం డబ్బులు అందలేదని ఆయన ఆరోపించారు. కౌలు రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలను మూడేళ్లుగా ఫైనల్ చేయలేదని విమర్శించారు. కేంద్రమంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కుంతియా ఆరోపించారు. రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్స్‌తో పోల్చగా.. ఓలా క్యాబ్స్ వచ్చాక కార్ల అమ్మకాలు పడిపోయాయని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళనలు చేస్తామన్నారు. బీజేపీ విధానాలపై ఈ నెల 8న కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16న హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తామని కుంతియా చెప్పారు.
‘వ్యవసాయ వృద్ధి’ వెంటిలేటర్ పై
దేశంలో ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు వెంటిలేటర్‌పై ఉందని కర్నాటక మాజీమంత్రి హెచ్ కె పాటిల్ విమర్శించారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమావేశంలో భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, కోదండ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

