హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి తన సొంత నియోజకవర్గమైన గుల్బర్గా వెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గే.. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో బస చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన సర్ మీటింగ్, పీఏసీ సమావేశ వివరాలను సీఎం, పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్.. ఖర్గేకు వివరించారు. అనంతరం ఆదివారం ఉదయం మల్లికార్జున ఖర్గే రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్లారు.
