- ఇకపై ఆయా కోర్సులకు టెక్నికల్ హోదా
- అనుమతి ఉంటేనే అడ్మిషన్లు తీసుకోవాలని ఆదేశం
- హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ
- 400 కాలేజీల్లో కోర్సులు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షాక్ ఇచ్చింది. ఆయా కోర్సులు టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే ఉన్నాయని, వాటిని కొనసాగించేందుకు ఏఐసీటీఈ గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌కు ఏఐసీటీఈ లేఖ రాసింది.
రాష్ట్రంలో సుమారు 400 డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు కొనసాగుతున్నాయి. అయితే వాటికి ఏఐసీటీఈ అనుమతి లేదు. టీజీసీహెచ్ఈ మాత్రం తమకు మూడేండ్ల అనుమతి 2026-–27 విద్యాసంవత్సరం వరకూ ఉందని చెప్తూ వచ్చింది. ఈ క్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు ఏఐసీటీఈకి లేఖ రాయగా, స్పష్టతనిస్తూ రిప్లై ఇచ్చారు.
చట్టం ప్రకారం మేనేజ్‌మెంట్ కోర్సులే..
1987 ఏఐసీటీఈ చట్టం సెక్షన్ 2(జీ) ప్రకారం.. ఇంజినీరింగ్, టెక్నాలజీతో పాటు మేనేజ్‌మెంట్ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందకే వస్తుందని తెలంగాణ అధికారులకు పంపిన లేఖలో ఏఐసీటీఈ అడ్వైజర్ మోరె రాములు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీలు కేవలం యూనివర్సిటీల అనుమతితోనే ఈ కోర్సులను నడిపిస్తున్నాయి. కానీ ఇకపై అకడమిక్ ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ నియామకాల్లో నాణ్యత పెంచేందుకు ఏఐసీటీఈ నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
కొత్త, పాత కోర్సులన్నిటికీ వర్తింపు
తెలంగాణలోని వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్తగా ప్రారంభించే కోర్సులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న బీబీఏ, బీసీఏ కోర్సులకు కూడా తప్పనిసరిగా ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాలని ఆదేశించింది. నిబంధనలు పాటించే సంస్థలకు అవసరమైన మార్గదర్శకాలను, సహకారాన్ని అందిస్తామని ఏఐసీటీఈ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆయా కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు లేకపోవడంతో మేనేజ్‌మెంట్లతో పాటు, ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది.
