- వరుస ఓటముల నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి సెగలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ పదవి నుంచి ఎడప్పాడి కె. పళనిస్వామి(ఈపీఎస్) తప్పుకోవాలని ఒక వర్గం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు తమ అసంతృప్తిని ఈపీఎస్ వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. వరుసగా నాలుగు (2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ, 2024 లోక్ సభ, 2026 అసెంబ్లీ) ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో, ఇకపై ఆయన నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
అయితే, పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అంతా సజావుగానే ఉందని పళనిస్వామి కొట్టిపారేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను అన్నాడీఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమైంది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోను ఓటమి పాలైంది. ఈ వరుస వైఫల్యాలు పార్టీ
శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, నాయకత్వ వ్యూహాలపై తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.
విజయ్ వైపు షణ్ముగం చూపు!
హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం మొదటి ప్రయత్నంలోనే 108 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. మెజార్టీ మార్కుకు10 సీట్ల దూరంలో నిలిచినప్పటికీ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల షణ్ముగం వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో రిసార్ట్‌లో మకాం వేయడం సంచలనం సృష్టించింది. వారు టీవీకే ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
పరిస్థితి చక్కదిద్దేందుకు పళనిస్వామి స్వయంగా రిసార్ట్‌కు వెళ్లినప్పటికీ, అసంతృప్తి చల్లారలేదని తెలుస్తోంది. మరోవైపు, డీఎంకే కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తెరవెనుక చర్చలు జరుపుతోందన్న వార్తలు షణ్ముగం వర్గాన్ని మరింత ఆగ్రహానికి గురిచేశాయి.
