- 2019 తర్వాత నమోదైన వారికి హెల్త్ కార్డులు అందించాలి
- ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ
ముషీరాబాద్, వెలుగు: అడ్వకేట్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది వకీళ్లకు సరైన ఆదాయం లేదన్నారు. 2019 తర్వాత నమోదైన అడ్వకేట్లకు హెల్త్ కార్డులను అందించాలని కోరారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఐలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించే అధికారికం కేవలం కోర్టులకే ఉంటుందని, అలాంటి వ్యవస్థలో పని చేస్తున్న న్యాయవాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వకీళ్లు లేకపోతే సాధారణ ప్రజలు తమ హక్కులు పొందలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పార్థసారథి, రఘునాథ్, శ్రీనివాస్ రావు, మహేశ్, శైలజ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
