ఖరీఫ్ మొదలై నెలరోజులు కావస్తున్నా.. వర్షాలు పడకపోవడంతో తెలంగాణలో రైతాంగా ఆందోళన చెందుతోంది. పత్తా లేని వానదేవుడికోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు రైతన్నలు. ఆలయాల్లో నీళ్ల బిందెలతో ప్రదక్షిణలు చేస్తూ సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నారు. తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ కొన్ని జిల్లాలో ఒక్క చినుకు లేదు. వానదేవుడి రాకకోసం రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. వానాకాలం పంటలకోసం ఇంకా భూతల్లిని చదును చేయలేదు రైతన్నలు. వరుణ దేవుడు కరుణించాలని, వర్షాలు బాగా కురువాలని గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తు్న్నారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా గ్రామాల్లో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలు ఆడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవతలకు కుండలతో జలాభిషేకం చేశారు. చిన్నారులతో కప్పతల్లి ఆటలు ఆడించారు.
పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు గ్రామాల్లోని ప్రజలు. సుల్తానాబాద్ పట్టణంలో వర్షాలకు కురవాలని మహిళలు నందీశ్వరుడికి, శివుడికి జలాభిషేకం చేశారు డప్పు చప్పుళ్లతో దేవాలయాల్లో నీళ్ల బిందెలతో ప్రదక్షిణలు చేశారు.వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో రైతులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని ఆ శివుడిని వేడుకున్నారు.
