బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సోనమ్ ఖాన్ ఎట్టకేలకు ఎట్టకేలకు 35 ఏళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్లపై స్పందించారు. ‘త్రిదేవ్’ సినిమా సమయంలో దర్శకుడు రాజీవ్ రాయ్‌తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశారు. ‘త్రిదేవ్’ విడుదలైన తర్వాతే తామిద్దరం ప్రేమలో పడి, ఆపై వివాహం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రచారానికి తెరదించుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.
‘త్రిదేవ్’ సమయంలో ఎలాంటి ఎఫైర్ లేదు..
‘ఓయే ఓయే తిర్చీ టోపీ వాలే’ పాట వీడియోను షేర్ చేసిన సోనమ్.. ‘త్రిదేవ్’ షూటింగ్ రోజుల్లో తాను దర్శకుడు రాజీవ్ రాయ్‌తో ప్రేమలో ఉన్నానన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. “ఓయే ఓయే ఓయే ఓయే.. ఓ నో..! అంటే పెద్ద ‘నో’ అనే అర్థం. నిజం ఏంటంటే.. ‘త్రిదేవ్’ దర్శకుడితో నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. సినిమా షూటింగ్ ఫస్ట్ డే, మొదటి పాటతోనే తొలిసారి ఈ రూమర్ పుట్టింది. సినిమా విడుదలైన తర్వాత నేను దర్శకుడితో ప్రేమలో ఉండటం వల్లే మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కంటే నాకు ఎక్కువ ప్రాధాన్యం దక్కిందని చాలామంది నమ్మారు. అందుకే నాకు ఎక్కువ స్క్రీన్ టైమ్, దేశమంతా మారుమోగిన సూపర్ హిట్ పాట దక్కాయని భావించారు” అని ఆమె పేర్కొన్నారు.
అప్పటికే ఇద్దరికీ వేరే రిలేషన్‌షిప్స్
ఆ సమయంలో తామిద్దరం వేరే వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నామని సోనమ్ వెల్లడించారు. “ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజీవ్ రాయ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి షూటింగ్‌కు వచ్చేవారు. నేను కూడా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. నా బాయ్‌ఫ్రెండ్ సెట్స్‌కు కొద్ది దూరంలో కారులో వేచి ఉండేవాడు. మేమిద్దరం అప్పటికే ఇతరులతో కమిట్ అయి ఉన్నాం. ‘ఓయే ఓయే’ పాట కేవలం అదృష్టవశాత్తూ నా చేతికి వచ్చింది” అని చెప్పారు.
నన్ను తీసుకోవడం రాజీవ్‌కు ఇష్టం లేదు
మరో ఆసక్తికర విషయం కూడా ఆమె వెల్లడించారు. దర్శకుడు రాజీవ్ రాయ్ మొదట్లో తనను ‘త్రిదేవ్’ కోసం ఎంపిక చేయాలని అనుకోలేదని చెప్పారు. “యష్ చోప్రా నిర్మించిన ‘విజయ్’ సినిమా రషెస్ చూసిన తర్వాత రాజీవ్ రాయ్‌కు నేను అంతగా నచ్చలేదు. అందుకే ఆయన మరో హీరోయిన్‌తో దాదాపు ఒప్పందం కూడా పూర్తి చేశారు. చివరికి వేరే మార్గం లేకపోవడంతో నన్ను ఎంపిక చేశారు. నిజానికి నేను చివరి ఆప్షన్ మాత్రమే” అని వెల్లడించారు.
ఛాన్స్ అందుకే వచ్చిందా?
తనకు దర్శకుడి నుంచి ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందన్న వాదనలను కూడా ఆమె కొట్టిపారేశారు. “ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు.. రహస్య ఫోన్ కాల్స్ లేవు.. ‘డైరెక్టర్ ప్రివిలేజ్’ అనే ప్రత్యేక ప్రయోజనం కూడా లేదు. అలాంటిది నిజంగా ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఒక మంచి పాట మాత్రమే నా జీవితంలోకి వచ్చింది. ‘త్రిదేవ్’ విడుదలైన చాలా కాలం తర్వాత మేమిద్దరం సింగిల్‌గా ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాం. అప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘త్రిదేవ్’ నిర్మాణ సమయంలో నాకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం దక్కలేదు. సున్నా.. పూర్తిగా సున్నా” అని సోనమ్ రాసుకొచ్చారు.
పెళ్లి, విడాకులు..
‘త్రిదేవ్’ తర్వాత ప్రేమలో పడిన సోనమ్ ఖాన్, రాజీవ్ రాయ్ 1991లో వివాహం చేసుకున్నారు. ‘విశ్వాత్మ’ సినిమా సమయంలో కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లో విడిపోయారు. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అంటే పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత వారి విడాకుల ప్రక్రియ పూర్తయింది. కాగా, రాజీవ్ రాయ్ ‘త్రిదేవ్’, ‘విశ్వాత్మ’, ‘మొహ్రా’, ‘గుప్త్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
