భారత టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలికింది. ఇప్పటివరకు కేవలం స్పీడ్, నెట్‌వర్క్ కవరేజ్ చుట్టూ తిరిగిన దేశీయ 5G ప్రయాణం.. ఇప్పుడు గ్లోబల్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ వైపు అడుగులు వేస్తోంది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం అత్యంత అధునాతన '5G స్లైసింగ్' అనే టెక్నాలజీని లాంచ్ చేసింది. అమెరికా, యూకే, సింగపూర్, మలేషియా వంటి అడ్వాన్స్‌డ్ గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్రీమియం ఫీచర్.. ఇప్పుడు భారత టెలికాం యూజర్ల చెంతకు వచ్చేసింది.
అసలు ఏంటి ఈ 5G స్లైసింగ్?
సాధారణంగా పండుగలు, క్రికెట్ స్టేడియాలు, ఎయిర్‌పోర్టులు, కచేరీలు, విపరీతమైన రద్దీ ఉండే నగర ప్రాంతాల్లో ఒకేసారి వేలాది మంది మొబైల్స్ వాడటం వల్ల నెట్‌వర్క్ జామ్ అయిపోతుంది. స్పీడ్ పడిపోవడం, కాల్స్ డ్రాప్ అవ్వడం కామన్. అయితే ఈ '5G స్లైసింగ్' టెక్నాలజీతో ఆ తలనొప్పులు ఉండవు. ఇది నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వనరులను అత్యంత సమర్థవంతంగా విభజించి, అదనపు కెపాసిటీని క్రియేట్ చేస్తుంది. అంటే.. రద్దీ ఎక్కువగా ఉన్నా సరే, ప్రయారిటీ యూజర్లకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ లేన్ కేటాయించబడుతుంది. దీనివల్ల ఎక్కువ మంది జనం ఆ ప్రాంతంలో ఫోన్ వాడటం వల్ల వచ్చే డ్రాపింగ్ నెట్ వర్క్ సమస్యలతో ఎలాంటి అంతరాయం లేని హై-స్పీడ్, స్థిరమైన కనెక్టివిటీ లభిస్తుంది పోస్ట్ పెయిడ్ యూజర్లకు.
గడిచిన రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5G నెట్‌వర్క్‌ను విస్తరించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పటివరకు మన ఫోకస్ అంతా కేవలం జనాభాకు 5G రీచ్‌ను పెంచడం పైనే ఉంది. కానీ ఎయిర్‌టెల్ తీసుకున్న నిర్ణయంతో భారత టెలికాం మార్కెట్ తర్వాతి రౌండ్‌కు అప్‌గ్రేడ్ అయిందని స్పష్టమవుతోంది. ఇకపై కేవలం వేగం మాత్రమే కాదు.. నమ్మకమైన నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, ఇంటెలిజెంట్ రిసోర్స్ అలొకేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారత్ నిలవబోతోంది.
ALSO READ : థ్రిల్ కోసం ఎక్కితే 245 ఎత్తులో గాల్లోనే ఆగిపోయిన రోలర్ కోస్టర్ !
ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని రన్ చేయడానికి అత్యంత బలమైన నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ అవసరం. ఎయిర్‌టెల్ దీన్ని విజయవంతంగా అమలు చేసిందంటే.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు ఎంతగా మెచ్యూర్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. సో గ్లోబల్ టెక్నాలజీ రేసులో భారత్ కేవలం ఫాలోవర్ మాత్రమే కాదు, లీడర్ అని ఎయిర్‌టెల్ నిరూపించింది. రద్దీ ప్రాంతాల్లోనూ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకెళ్లే 5G అనుభూతిని ఆస్వాదించడానికి ఇండియన్ యూజర్స్ కి అవకాశం దొరికింది ఇప్పుడు.
