శరద్ పవార్ ఇంటికెళ్లిన అజిత్ పవార్

శరద్ పవార్ ఇంటికెళ్లిన  అజిత్ పవార్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇంటికెళ్లారు. మహారాష్ట్ర కాబినెట్ విస్తరణ జరిగిన  మరుసటి రోజే ముంబైలోని శరద్‌ పవార్‌ అధికారిక నివాసమైన సిల్వర్‌ ఓక్‌ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.  శరద్ పవార్ తో సమావేశం కావడానికే ఆయన అక్కడికి వెళ్లారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అయితే దీనిపై అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు క్లారిటీ ఇచ్చారు.   

శరద్ పవార్ సతిమణీ ప్రతిభా పవార్‌కుముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేతికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆమెను పరామర్శించడానికి అజిత్  పవార్ అక్కడికి వెళ్లారని వెల్లడించారు. ప్రతిభా పవార్‌ తో అజిత్  పవార్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. 2019లో పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతన్ని తిరిగి ఎన్సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. జూలై 2న ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత అజిత్ పవార్ సిల్వర్ ఓక్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.

అజిత్ పవార్ కు కీలక పదవులు 

అజిత్  పవార్​కు సీఎం ఏక్ నాథ్  షిండే కేబినెట్​లో కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. ప్రణాళిక శాఖ బాధ్యతలు కూడా ఆయనే చూస్తారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి శివసేన బీజేపీ ప్రభుత్వంలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు షిండే కేబినెట్​లో చోటు దక్కింది. గత నెలలో అజిత్  పవార్  నేతృత్వంలోని 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు.