సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించింది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. జూన్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ‘సర్కారు నౌకరి’ పీరియాడిక్ డ్రామా అయితే, ఈ చిత్రం పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందింది. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.
లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నా. ఇందులో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే పాత్ర ఇది. నటనపరంగా కూడా మొదటి సినిమాతో పోలిస్తే మరింత మెరుగ్గా కనిపించేందుకు ప్రయత్నించాను.
బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. సీనియర్‌ల సలహాలతో, మా అమ్మ సూచనలతో నా పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నా. టైటిల్‌కు తగ్గట్టే కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ఊహించలేరు. తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉంది. దీనివల్ల మా సినిమా మరింత మందికి చేరుతుందని భావిస్తున్నాం’ అని చెప్పాడు.
