లిక్కర్ బానిసలు ట్రిపుల్​..  రాష్ట్రంలో మూడేండ్లలో భారీగా పెరిగిన ఆల్కహాల్ అడిక్టర్స్

లిక్కర్ బానిసలు ట్రిపుల్​..  రాష్ట్రంలో మూడేండ్లలో భారీగా పెరిగిన ఆల్కహాల్ అడిక్టర్స్
  • డీఅడిక్షన్ సెంటర్లకు రోజూ 2 వేల మంది క్యూ

  • గల్లీకో బెల్ట్ షాపు ఉండటంతో పొద్దున్నుంచే డ్రింకింగ్​ షురూ

  • రోజూ తాగనిదే ఉండలేని పరిస్థితి
  • మద్యం మత్తులో పెరుగుతున్న నేరాలు, దారుణాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రైవేట్​ రిహాబిలిటేషన్ సెంటర్లు
  • లిక్కర్ సేల్స్‌‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న సర్కారు
  • తాగేటోళ్ల ఆరోగ్యం, డీఅడిక్షన్ సెంటర్ల గురించి మాత్రం పట్టించుకుంటలే

 

కరీంనగర్, వెలుగు: ఒకప్పుడు పండుగకో, పబ్బానికో మందుతో దావత్ చేసుకునేటోళ్లు.. చావుకో, కష్టానికో తాగేటోళ్లు.. కానీ ఇప్పుడు రోజూ లిక్కర్ తాగనిదే ఉండలేని పరిస్థితికి చేరుతున్నారు. గల్లీకో బెల్ట్ షాపు ఉండటంతో కొందరు పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నారు. క్రమంగా లిక్కర్‌‌‌‌కు బానిసలవుతున్నారు. దీంతో రెండు, మూడేండ్లుగా ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య మూడింతలైంది. రాష్ట్రంలో రోజుకు 2 వేల మంది దాకా డీ అడిక్షన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా వెలుస్తున్న ప్రైవేటు డీఅడిక్షన్​ సెంటర్లు.. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఏటేటా లిక్కర్ సేల్స్‌‌ను పెంచుకుంటున్న సర్కారు.. తాగేటోళ్ల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు గురించే ఆలోచించడం లేదు. మద్యానికి బానిసైన వాళ్లలో పేదలే ఎక్కువగా ఉంటుండటంతో.. ప్రైవేటు డీఅడిక్షన్ సెంటర్లకు వెళ్లలేకపోతున్నారు. దీంతో మద్యం మత్తులో కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. కొందరు కొన్నిచోట్ల నేరాలకు, దారుణాలకు తెగబడుతుతున్నారు.

రాష్ట్రంలో 43 శాతం మందికి అలవాటు

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 - 22 ప్రకారం రాష్ట్రంలో 43 శాతం మందికి లిక్కర్ తాగే అలవాటుంది. దేశంలో అత్యధికంగా తాగుడు అలవాటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది రెండో స్థానం. అయితే అదే పనిగా పొద్దస్తమానం తాగుతూ తూలేవాళ్ల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. బెల్టు షాపులు భారీగా పెరిగిపోవడంతో.. ఎప్పుడు కావాలన్నా మందు దొరకుతుండటంతో తాగుడు ఎక్కువైంది. దీంతో ఆ అలవాటు మానుకునేందుకు డీఅడిక్షన్ సెంటర్లు, సైకియాట్రిస్టుల దగ్గరికి వస్తున్న వారి సంఖ్య మూడేళ్లుగా భారీగా పెరుగుతున్నది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 12 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ (ఐఆర్ సీఏ)కు గతంలో రోజుకు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఔట్ పేషెంట్లుగా కౌన్సెలింగ్ కు వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిది, పదికి చేరిందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. 15 బెడ్స్‌‌‌‌తో ఉన్న ఈ రిహాబిలిటేషన్ సెంటర్ లో ప్రస్తుతం 13 మంది ఇన్ పేషెంట్లుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మిగతా వారికి కౌన్సెలింగ్‌‌‌‌తోపాటు మందులు ఇచ్చి పంపుతున్నారు. 

మూడు జిల్లాల్లోనే 300 డీఅడిక్షన్ సెంటర్లు

రాష్ట్రంలో హైదరాబాద్‌‌‌‌తోపాటు సిటీ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు 300 ఆల్కాహాల్ డీఅడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జిల్లాకో రెండు, మూడు సెంటర్లు ఉన్నాయి. ఇవేగాక డీఅడిక్షన్ సర్వీసులు అందించే సైకియాట్రిస్టు క్లినిక్స్ జిల్లాకో పదికిపైగా ఉన్నాయి. ఇలా మొత్తంగా 500 డీఅడిక్షన్ సెంటర్లు ప్రైవేట్ సెక్టార్ లో, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అంచనా. ఇందులో 50 సెంటర్లకు మాత్రమే ప్రభుత్వ​అనుమతి ఉండగా.. మిగతావి ఎలాంటి పర్మిషన్ లేకుండానే రన్ అవుతున్నాయి. ఆల్కహాల్ అడిక్టర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఎలాంటి అర్హత, అనుభవం లేని వ్యక్తులు కూడా శివారు ప్రాంతాల్లో డీఅడిక్షన్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ప్రైవేట్ డీఅడిక్షన్ సెంటర్లలో నెలన్నర నుంచి మూడు నెలల ట్రీట్ మెంట్ కు 30 వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో ఈ సర్వీసులు ఫ్రీగా అందుతున్నాయి. రోజుకు ఇక్కడికి 20 నుంచి 30 మంది ఆల్కహాల్ బాధితులు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్ లో కౌన్సెలింగ్ ఇస్తూ, మందులు రాసిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ డీఅడిక్షన్ సెంటర్లకు రోజూ వచ్చే ఆల్కాహాల్ బానిసల సంఖ్య రోజూ సగటున 2 వేల వరకు ఉంటుందని అంచనా.

లిక్కర్ అమ్మకాల్లో రికార్డులు బ్రేక్

రాష్ట్ర సర్కార్ ఖజానాకు లిక్కర్ ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. రాష్ట్రంలో 2,620 వైన్స్, సుమారు 1,200 బార్ల ద్వారా ప్రస్తుతం మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఆదాయంలో ఏటేటా రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. తర్వాతి నుంచి లిక్కర్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. 2014-15లో రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2018-19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్ అయింది. 2021-22లో 34 వేల కోట్లు చేరింది. ఈ ఏడాది రూ.40 వేల కోట్లకు చేరుతుందని సర్కార్ భావిస్తున్నది. ఈ లెక్కన పదేండ్లలో లిక్కర్ ఆదాయం నాలుగింతలు కాబోతున్నది. జనం తాగి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వారి ఆరోగ్యం, అడిక్షన్‌‌‌‌పై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు.

యాక్సిడెంట్ కేసుల్లో 30 శాతం ఇవే

జిల్లా హాస్పిటల్‌‌కు వచ్చే యాక్సిడెంట్ కేసుల్లో 30 శాతం దాకా ఆల్కహాల్‌‌కు సంబంధించినవే ఉంటున్నాయి. వెహికల్స్ నడుపుతూ పడిపోయిన వాళ్లు, ఎక్కువ తాగి పడిపోయినవాళ్లు, అనారోగ్య కారణాలతో వచ్చే వాళ్లలో నెలకు సుమారు 150 నుంచి 200 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. వీరిలో ఆల్కహాల్ బాగా తీసుకునేవాళ్లే ఉంటున్నారు. ఇలాంటి వాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తాగుడు మాన్పించేందుకు మెడిసిన్స్ ఇస్తున్నాం.

- డాక్టర్ ఎల్.వర్షి, సైకియాట్రిస్టు , కరీంనగర్ జిల్లా హాస్పిటల్
డీఅడిక్షన్ సెంటర్లపై

జీవోతో సరి

ఉమ్మడి ఏపీలో 2006లో మద్య విమోచన ప్రచార సమితి జిల్లాకో డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు 2013లో అప్పటి ప్రభుత్వం సెంటర్ల ఏర్పాటు చేసేందుకు జీవో జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలోని 13 జిల్లాల్లో 18 డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మాత్రం ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. దీంతో అన్ని జిల్లాల్లో డీఅడిక్షన్ సెంటర్లను ప్రారంభించాలని కోరుతూ హైకోర్టును 2016లో సోషల్ యాక్టివిస్టు మామిడి వేణుమాధవ్ ఆశ్రయించారు. ఈ కేసులో ఎన్ని వాయిదాలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు. ఇటీవల హైకోర్టు సీరియస్ కావడంతో ఎట్టకేలకు స్పందించింది. 33 జిల్లాల్లో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు జీవో జారీ చేసింది. కానీ సెంటర్ల  ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు.

మూడేండ్ల నుంచి కేసులు పెరిగాయి

మూడేండ్ల నుంచి ఆల్కహాల్ అడిక్షన్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇది వరకు అరుదుగా వచ్చేవాళ్లు. ప్రస్తుతం మా క్లినిక్ కు రోజుకు ముగ్గురు, నలుగురు ఆల్కహాల్ బాధితులు వస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి, మందులు రాసి పంపిస్తున్నాం. మూడు, నాలుగు సిట్టింగ్‌‌‌‌ల తర్వాత వాళ్లలో మార్పు వస్తున్నది.

- డాక్టర్ బి.పురుషోత్తం, సైకియాట్రిస్టు, కరీంనగర్

 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లికి చెందిన గుండ్ల సదానందం మద్యానికి బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక భార్య ఆరు నెలల కింద ఆత్మహత్య చేసుకుంది. అతడికి కుమారుడు (20), కుమార్తె రజిత (11) ఉన్నారు. సదానందం విపరీతంగా మద్యం తాగుతూ అందరితో గొడవ పడేవాడు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తున్న కూతురు మెడపై గొడ్డలితో నరకడంతో అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత సమీపంలోని కిరాణ దుకాణ యజమాని, ఎల్ఐసీ ఏజెంట్ దూపం శ్రీనివాస్ మెడపైనా గొడ్డలితో దాడి చేశాడు.