తిరుమల శ్రీవారి భక్తుల కొరకు జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవా కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు (ఏప్రిల్ 21) విడుదల చేసింది. ఏయే టికెట్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో వివరాలు ఇలా ఉన్నాయి:
ఈరోజు (ఏప్రిల్ 21) ఆర్జిత సేవల విడుదల
ఈరోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. అలాగే, వర్చువల్ సేవలకు సంబంధించిన కోటాను నేడు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచనుంది.
ఏప్రిల్ 23న
ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్.. శ్రీవాణి టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్లను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు.
ఏప్రిల్ 24న రూ.300 టికెట్లు & గదుల బుకింగ్
ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వసతి గదులు కోసం తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు.
ముఖ్య గమనిక: భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తులు ఈ సమయాలను గుర్తుంచుకుని, ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఈ వివరాలు జారీ చేయబడినది.

