ఈ దేశం నాదే అనుకునేవాళ్లంతా హిందువులే

ఈ దేశం నాదే అనుకునేవాళ్లంతా హిందువులే

అందరూ కలిసి నడవాలన్నదే సంఘ్​ ఆకాంక్ష: మోహన్​భగవత్
లాఠీలతో కొడితే మంచి ఉద్దేశాలు అలవాటు కావు
ఎవరికి వారే వాటిని అలవర్చుకోవాలి
మన గెలుపు, స్వార్థం కాదు.. దేశం గెలవాలి
దేశం విశ్వగురువు కావడం లీడర్ల వల్ల కాదు
దేశం కోసం త్యాగాలు చేసే నేతలేరి?
రాజకీయ పార్టీలు దేశాన్ని మార్చలేవు
ప్రజా చైతన్యంతోనే మార్పు సాధ్యం
సార్వజనీకోత్సవ సభలో ఆర్ఎస్ఎస్చీఫ్
స్వయం సేవకులతో కిక్కిరిసిన సరూర్నగర్ స్టేడియం..
హాజరైన బీజేపీ నేతలు, ప్రముఖులు

హైదరాబాద్, వెలుగుఎవరు భారతదేశాన్ని తమ మాతృభూమి అనుకుంటారో.. ఎవరు ఇక్కడి భూమిని, చెట్లను, పక్షులను, జంతువులను సమదృష్టితో చూస్తారో.. ఈదేశం నాదే అనుకునే వాళ్లంతా భరతమాత బిడ్డలేనని, హిందువులేనని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్నారు. ఏ భాష మాట్లాడేవారైనా సరే.. ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే.. ఏ పూజ చేసే వారైనా సరే.. పూజలు చేయనివారైనా సరే.. ఈ గడ్డ మీద జీవిస్తున్న 130 కోట్ల మందీ తమ దృష్టిలో హిందూ సమాజమేనని పేర్కొన్నారు. సంఘ్​ అందరినీ తనవాళ్లుగా చూస్తుందని చెప్పారు. లాఠీలతో కొడితేనో, దండిస్తేనో, ఉపదేశాలతోనో, ఉపన్యాసాలతోనో మంచి ఉద్దేశాలు అలవడవని చెప్పారు. దండనతో కేవలం భయపెట్టడం సాధ్యమవుతుందన్నారు. మంచి ఉద్దేశాలు ఎవరికి వారు అలవర్చుకోవాలని సూచించారు. ప్రేమతో ఇతరుల్లో సాత్వికతను తేవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన విజయ సంకల్ప శిబిరం సార్వజనీకోత్సవ సభలో మోహన్​భగవత్​ పాల్గొని మాట్లాడారు. 70ఏండ్లుగా భారతదేశం శాంతితో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నదని, దీనిని మనవాళ్లు ఎక్కువగా ప్రచారం చేసుకోవడం లేదని అన్నారు.

అయినా ఏం జరిగిందో మనమంతా చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలన్న దృఢ సంకల్పం అందరిలో రావాలని సూచించారు. ధర్మ విజయం కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని, ఇలాంటి స్వభావం మన దేశం మట్టిలోనే దాగి ఉందని  తెలిపారు.  ‘‘దేశంలో 50 ఏండ్ల పాటు ముక్కోటి దేవతలను ఆరాధించడం ఆపేసి ఒక్క భరతమాతకే పూజ చేయాలని వివేకానందుడు ఎప్పుడో సూచించారు. అలా చేసిన రోజు భరతమాత విశ్వగురుగా మారుతుందని, ప్రపంచం మొత్తం భారతదేశం పయనించిన మార్గంలోకి వస్తుందని చెప్పారు” అని ఆయన గుర్తు చేశారు. భరతమాతను విశ్వగురుగా మార్చేందుకు ప్రతి భారతీయుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, నాయకులు  దేశాన్ని  మార్చలేరని, ప్రజా చైతన్యంతోనే మార్పు వస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని వివేకానందుడు చెప్పేవారని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ధర్మ విజయాన్ని మాత్రమే కోరుకుంటుందని చెప్పారు. తనకు తానుగా ఏమీ కోరుకోని వారే ధర్మ విజయానికి పునాదులు వేస్తారని తెలిపారు. తమ హితం, మంచి కోసం వారు చింతించరని, గెలుపు ద్వారా రాజ్యం, స్వర్గం, మోక్షం కూడా కోరుకోరని, ఇతరుల దుఃఖాన్ని, చింతను తీర్చాలని మాత్రమే కోరుకుంటారని అన్నారు. సంఘ్‌, హిందూ సమాజం కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. దీనినే సాత్విక శక్తి విజయం అని కూడా అంటారని వివరించారు. ఇదే అందరినీ ఒక్కటి చేస్తుందన్నారు.

రోజుకు ఒక గంట శాఖకు కేటాయించాలి

స్వయం సేవకులు కనీసం ధన్యవాదాలు కూడా కోరుకోరని, అందరిని కలుపుకొని మాత్రమే పనిచేస్తారని మోహన్​ భగవత్​ గుర్తుచేశారు. సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయాలని, దేశం మంచి కోసం అందరిలోనూ సాత్విక పరివర్తన తేవాలని సూచించారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. సాత్విక పరివర్తన ఎవరికి కృతజ్ఞతతోనో చేసే పనికాదని, అందరి కర్తవ్యమని చెప్పారు. మనమంతా హిందూ దేశానికి అంగదూతలమని మోహన్‌ భగవత్‌ అన్నారు. ప్రేమ, సమన్వయంతో కలిసి నడవాలని తెలిపారు. భరత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన సోదరులేనని స్వయం సేవకులకు సూచించారు. రోజుకు ఒక గంట సంఘ్​ శాఖ కోసం కేటాయించాలని, భక్తి, శ్రద్ధలతో నిత్యం అభ్యాసం చేయాలని స్వయం సేవకులకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ పిలుపునిచ్చారు.

సంఘ్​లో ఆరు రకాల మార్గాలు, 1.30 లక్షల రకాల సేవలు ఉంటాయని చెప్పారు. స్వయం సేవకులు స్వార్థాన్ని కోరుకోరని, దేశ వైభవం పదిలంగా ఉంటే చాలని మాత్రమే ఆకాంక్షిస్తారని, వెయ్యి మంచి కార్యక్రమాలు చేసినా ఒక్కటి కూడా తమ ఖాతాలో వేసుకోరని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని సంఘం కోసం పనిచేసే వాళ్లే స్వయం సేవకులని ఆయన తెలిపారు. ఈ శిబిరానికి విజయ సంకల్ప శిబిరం అనే పేరు పెట్టారని, విజయం అంటే దేశం గెలుపునకు సంకల్పం తీసుకోవడమేనని మోహన్​ భగవత్​ అన్నారు. స్వాభిమానంతో సంఘం విజయం సాధించాలనేదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. స్వయం సేవకులు ఈ సంకల్పంతో నిలబడితే అది పద సంచాలనం అవుతుందన్నారు. ‘‘మనం 90 ఏండ్లుగా శాంతితో పనిచేస్తున్నాం. ప్రచారం చేసుకోవడంలో మాత్రం వెనుకబడ్డాం. ఈ కార్యక్రమం ఒక్క స్వయం సేవకులది మాత్రమే కాదు.. ఇలాంటి కార్యక్రమాలు స్వయం సేవకుల్లోని దృఢత్వాన్ని పరీక్షించే ఒక మార్గంగా నిలుస్తాయి. మొత్తం సమాజాన్ని
దృఢంగా, సమర్థంగా చేయడమే మన లక్ష్యం” అని చెప్పారు.

నిస్వార్థ నాయకులు కావాలి

ఇంతటి దేశంలో ఒక్క నాయకుడు కూడా నిస్వార్థంగా సంపూర్ణ సమాజాన్ని తన వాళ్లు అనుకోవడం లేదని, సమాజం కోసం బలిదానం చేసేవాళ్లు ఎవరూ లేకుండా పోయారని మోహన్ భగవత్​ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీ బస్తీలో నిస్వార్థ నాయకులు రావాలని, అలాంటి వాళ్లు వస్తే సమాజం మారుతుందని తెలిపారు. అలాంటి వారిని తయారు చేసేందుకు సంఘ్​ ముందుంటుందని చెప్పారు. దేశానికి ఎలాంటి మార్గం అవసరమో.. దానిని నిర్దేశించడం ఆర్​ఎస్​ఎస్​ బాధ్యత అని వివరించారు. మోహన్‌ భగవత్‌ ప్రసంగాన్ని ముగించిన తర్వాత దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ ప్రచారక్‌ శ్రీధర్‌ తెలుగులో అనువదించి చెప్పారు.

తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి: మోహన్‌రెడ్డి

తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉండాలని, అప్పుడే పిల్లలకు మంచి విలువలు అలవడుతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీఆర్‌ మోహన్‌రెడ్డి సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విజయ సంకల్ప శిబిరంలో పాల్గొన్న ఆయన మోహన్‌ భగవత్‌ కన్నా ముందు సభలో మాట్లాడారు. తాను 28 ఏండ్ల  క్రితం స్థాపించిన చిన్న సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఇప్పుడు 15 వేల మందికి ఉపాధినిస్తోందని చెప్పారు. సమాజాన్ని మంచిమార్గంలో తీసుకెళ్లేవి.. విలువలు, స్త్రీ శక్తి, చదువు, టెక్నాలజీ అని అన్నారు. ఇవే పునాదులపై తమ సంస్థను స్థాపించామని తెలిపారు. విలువలు మాత్రమే విజయవంతమైన కుటుంబాన్ని, సమాజాన్ని నిర్మిస్తాయని అన్నారు. డబ్బు, ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సాధించుకోవచ్చని, విలువలు పోగొట్టుకుంటే ఎప్పటికీ తిరిగి రావని చెప్పారు. యువతకు తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం, మీడియా రోల్‌ మోడల్‌గా ఉండాలన్నారు. నైతిక విలువలు, విద్య, సాధికారత, ప్రతిస్పందన స్థిరంగా పనిచేస్తే పరిస్థితులను మార్చవచ్చని, ఇదే మార్గంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పయనిస్తోందని వివరించారు. ప్రపంచంలోనే పెద్ద ఎన్‌జీవో  ఆర్‌ఎస్‌ఎస్‌ అని తెలిపారు. ఈ సంస్థ నేర్పే క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు మన సమాజాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.

ఆకట్టుకున్న కవాతు

ఆర్ఎస్ఎస్ సార్వజనీకోత్సవ సభ, దానికి ముందు నిర్వహించిన పథ సంచలన్​ కవాతు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం అత్యంత క్రమశిక్షణ మధ్య కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇతర అనుబంధ సంఘాల కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. 20 వేల మందికిపైగా హాజరైనట్టు అంచనా. సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేజీకి కుడివైపున రుద్రమదేవి, అంబేద్కర్​ కటౌట్లు, ఎడమవైపు కొమ్రం భీం, వివేకానందుడి కటౌట్లు ఏర్పాటు చేశారు. సభ ఆద్యంతం జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో స్టేడియం హోరెత్తింది. శిశుమందిర్ విద్యార్థులు, ఆదివాసీల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సభకు ముందు పథ సంచలన్

సార్వజనీకోత్సవ సభకు ముందు సంఘ్ సేవకులు పథ సంచలన్ నిర్వహించారు. మన్సూరాబాద్‌‌, హస్తినాపురం, వనస్థలిపురం నుంచి ఖాకీ డ్రెస్, చేతిలో కర్ర, నెత్తిన టోపీతో సరూర్ నగర్ స్టేడియం వరకు కవాతు నిర్వహించారు. ఈ పథ సంచలన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అంతా ఓ పద్ధతిప్రకారం వరుసగా స్టేడియం లోపలికి వచ్చారు. నేలపై కూర్చున్నారు. సభలో ‘సీఏఏ వాస్తవాలు ఏమిటి?’ అనే పేరుతో పాంప్లెట్లు పంపిణీ చేశారు. అయితే బీజేపీ లీడర్లు, మహిళలు, ఇతర ప్రముఖులకు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. వేదిక మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖ్య అతిథి బీవీఆర్ మోహన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి ముకుందాజీ తదితరులు మాత్రమే కూర్చుకున్నారు. మిగతా లీడర్లు, కార్యకర్తలంతా సభాస్థలిలో కూర్చున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్యతో కలిసిరాగా.. బీజేపీ లీడర్లు రాంమాధవ్, మురళీధర్ రావు, లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావు, గరికపాటి మోహన్​రావు, జితేందర్ రెడ్డి ఆర్​ఎస్​ఎస్​ డ్రెస్​లో వచ్చారు. ఎంపీ బండి సంజయ్‌‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ స్వయం సేవకుల మధ్య నేలపై కూర్చున్నారు. వారితో కలిసి యోగాసనాలు వేశారు.

ఆసక్తిగా భగవత్  ప్రసంగం

ఆర్ఎస్ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం 6.16 గంటలకు మోహన్  భగవత్  స్పీచ్  మొదలుపెట్టారు. 6.45 గంటలకు ముగిసింది. 29 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. సంఘ్ సేవకులు, కార్యకర్తలు ఆసక్తిగా వినడం కనిపించింది. తర్వాత ఈ ప్రసంగాన్ని ఆర్ఎస్ఎస్  సంఘ్ ప్రచారక్  శ్రీధర్ తెలుగులోకి అనువాదం చేసి చెప్పారు. 6.59 గంటలకు భగవత్ వెళ్లిపోయారు. కాగా భగవత్  కంటే ముందు కేవలం పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రసంగించారు.

గట్టిగా పోలీసు బందోబస్తు

ఆర్ఎస్ఎస్​ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలికి వెళ్లే వారందరినీ డిటెక్టర్ల ద్వారా చెక్ చేశారు. కొద్దిసేపు నెట్ వర్క్ కట్ చేశారు. ఆర్ఎస్ఎస్​ కార్యకర్తలు పోలీసులకు పూర్తిగా సహకరించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా క్లియర్ చేశారు. ఇక గ్రౌండ్​లో మంచినీటి సదుపాయం కల్పించారు. అరటిపండ్లు ఇచ్చారు. స్టేడియం బయట జాతీయ వాద పుస్తకాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు.

20 వేల మంది హాజరు

సాయంత్రం మోహన్ భగవత్  సభా స్థలానికి రాగానే ధ్వజారోహణంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సంఘ్​ ప్రార్థన చేశారు. సంఘ్​ సేవకులతో యోగాసనాలు వేయించారు. కాగా భగవత్ రావడానికి ముందు 10 నిమిషాల పాటు సభలో అందరూ లేచి నిలబడ్డారు. నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా అంతసేపు నిలబడటం, తర్వాత ఓ పద్ధతి ప్రకారం కూర్చోవడం ఆకట్టుకుంది. మొత్తంగా ఈ కార్యక్రమానికి 20 వేల మందికిపైగా వచ్చినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. సరూర్​నగర్​ స్టేడియం మొత్తం నిండిపోగా.. కొందరు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చినవారిలో ఎక్కువగా యువత కనిపించారు. 9వ తరగతి స్టూడెంట్స్​ నుంచి 75 ఏండ్ల వయస్సు వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. అయ్యప్ప మాల వేసుకున్నవారు పెద్ద సంఖ్యలోనే కనిపించారు.