Allu Arjun: శిరీష్-నయనికను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు.. అల్లు బ్రదర్స్ ఎమోషనల్ పోస్టులు వైరల్

Allu Arjun: శిరీష్-నయనికను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు.. అల్లు బ్రదర్స్ ఎమోషనల్ పోస్టులు వైరల్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్‌, నయనిక వివాహం శుక్రవారం(మార్చి6)  ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అల్లు శిరీష్​, నయనికల వివాహం గ్రాండ్​గా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి  వివాహవేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, ఈ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ దృష్ట్యా అటెండ్ అవ్వలేకపోయాడు. దీంతో పెళ్లి అనంతరం ఆయన స్వయంగా హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం హోదాలోని బిజీ షెడ్యూల్ మధ్య అల్లు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు బ్రదర్స్ షేర్ చేస్తూ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ X వేదికగా ముఖ్యమంత్రి రాకపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండటంతో వ్యక్తిగతంగా కలవలేకపోయానని, అయితే ఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బన్నీ తెలిపారు. 

“మా సోదరుడు శిరీష్, నయనికలను ఆశీర్వదించడానికి మా ఇంటికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆత్మీయత, ఆశీస్సులు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. నేను విదేశాల్లో ఉండటంతో వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయినందుకు చింతిస్తున్నాను.

►ALSO READ | హన్సిక–సోహెల్ విడాకులు: నాకు పెయిడ్ PR టీమ్ లేదు..

అయినప్పటికీ, మీతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లభించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ నూతన దంపతుల పట్ల మీరు చూపిన ఆప్యాయతకు, అందించిన ఆశీస్సులకు మేము నిజంగా కృతజ్ఞులం. మీ ఈ ఆదరణ మా కుటుంబాన్ని ఎంతో స్పృశించింది” అంటూ బన్నీ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇక మరోవైపు నవ వరుడు అల్లు శిరీష్ కూడా తన X ఖాతాలో స్పందించారు. “ఇది నాకు ఒక గొప్ప గౌరవం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే చిరస్మరణీయమైన అనుభవం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మా ఇంటికి వచ్చి మా వివాహ సందర్భంగా నాకు మరియు నయనికకు శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

దూరదృష్టి కలిగిన ఆ నాయకుడితో సుమారు గంటసేపు జరిగిన సంభాషణ నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆ సమయంలో ఆయనతో మాట్లాడటం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం నాకు లభించింది,” అని శీరీష్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అల్లు బ్రదర్స్ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.