ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌‌‌‌‌.. 130 ఏటీఎం కార్డులు, రెండు స్వైపింగ్‌‌ మిషన్లు స్వాధీనం

ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌‌‌‌‌.. 130 ఏటీఎం కార్డులు, రెండు స్వైపింగ్‌‌ మిషన్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అమీన్‌‌పూర్‌‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నివాసంపై దాడి చేసి 33 బ్యాంకులకు చెందిన 130 ఏటీఎం కార్డులు, రెండు స్వైపింగ్‌‌ మిషన్లు, మూడు ఆటోలు, ఐదు సెల్‌‌ఫోన్లు, రూ.27 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 

ఈ వివరాలను శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్‌‌ శ్రీనివాస్‌‌ వెల్లడించారు. గత నెల 27న కిష్టారెడ్డిపేటలోని ఎస్‌‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. డబ్బులు రాకపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు సహాయం చేస్తామని చెప్పి ఏటీఎం కార్డు, పిన్‌‌ నంబర్‌‌ తీసుకున్నారు. అనంతరం మరో కార్డు ఇచ్చి పంపించారు. 

మరుసటి రోజు అతని ఖాతా నుంచి రూ.65,400 డ్రా అయినట్లు మెసేజ్‌‌ రావడంతో బాధితుడు అమీన్‌‌పూర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జీడిమెట్ల అపురూప కాలనీలో ముఠా సభ్యులను పట్టుకున్నారు. 

రాజస్థాన్‌‌, హర్యానాకు చెందిన షహజాద్‌‌, అజ్రుద్దీన్‌‌, మహ్మద్‌‌ జాఫర్‌‌, మహ్మద్‌‌ వసీం, సాకిబ్‌‌, అస్ఫాక్‌‌ ఖాన్‌‌లు కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. షహజాద్‌‌ గ్యాంగ్‌‌ లీడర్‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఉపయోగంలో లేని ఏటీఎం కార్డులను సేకరించి, ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకునేవారు. డబ్బులు డ్రా చేసేందుకు సహాయం చేస్తామని చెప్పి పిన్‌‌ నంబర్‌‌ తెలుసుకుని, బాధితుల అసలు కార్డును తమ వద్ద ఉన్న మరో కార్డుతో మార్చేసేవారు. 

అనంతరం ఆ కార్డులతో ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడం లేదా స్వైపింగ్‌‌ మిషన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించి, డబ్బులను తమ స్వగ్రామాల్లోని వాణిజ్య సంస్థల ఖాతాలకు మళ్లించేవారు. పరారీలో ఉన్న సోహైల్‌‌, ముబారక్‌‌ల కోసం హర్యానా, రాజస్థాన్‌‌లో రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.