ఖండాంతరాలు దాటిన ప్రేమ : ఒక్కటైన ఆంధ్రా అమ్మాయి..అమెరికా అబ్బాయి

ఖండాంతరాలు దాటిన ప్రేమ : ఒక్కటైన ఆంధ్రా అమ్మాయి..అమెరికా అబ్బాయి

చిత్తూరు : ప్రేమకు డబ్బు, కులమతాలు, సంప్రదాయాలు అడ్డురావంటారు. సిన్సియర్ గా ప్రేమిస్తే ప్రియురాలి కోసం ఎంతవరకైనా వస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే వినిపిస్తుంటాయి. కానీ..ఓ ప్రేమికుడు రియల్ లైఫ్లోనూ అది నిజం చేసి చూపించాడు. ఓ జంట ప్రేమ ఖండాంతరాలు దాటింది. అమెరికా అబ్బాయి ఆంధ్రా అమ్మాయిని ప్రేమించాడు. తన ప్రేమను గెలిపించుకొని పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకున్నాడు.

చిత్తూరు కొంగారెడ్డి పల్లె ఉషానగర్‌కు చెందిన సుధాకర్ నాయుడు కుమార్తె శ్రీ నిరీషా అమెరికాలోని మిచిగన్ యూనివర్శిటీలో ఎంఎస్ చదవడానికి 2013లో వెళ్లింది. అదే వర్శిటీలో చదవుతున్న ఆండ్రూ గార్ణియర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతడు ఓ రోజు ప్రపోజ్ చేయగా..ఆమె కూడా ఒప్పుకుంది. పెళ్లి విషయం మాత్రం తన తల్లిదండ్రులు, బంధవులుతో మాట్లాడి చెబుతానని చెప్పిందట. తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యలకు చెప్పగానే.. ముందు ఒప్పుకోలేదట. తర్వాత కూతురి ప్రేమను కాదలేక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అమెరికాకు వెళ్లి ఆండ్రూ గార్ణియర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీనిరీషా తల్లిదండ్రులు.. అక్కడే ఎంగేజ్ మెంట్ చేశారు.

పెళ్లి మాత్రం చిత్తూరులో హిందూ సంప్రదాయ పద్దతిలో చేసుకుందామని శ్రీనిరీషా, కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆండ్రూ ఫ్యామిలీ ఒప్పుకుంది. దీంతో ఇటీవల చిత్తూరులోని హోటల్‌ ప్రభగ్రాండ్‌ ఇన్‌లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఈ జంట ఒక్కటయ్యింది. కులమతాలు, ప్రాంతాలు, దేశాలు వేరైనా ప్రేమకు అవేమీ అడ్డుకాదని ఆ జంట నిరూపించింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ మోహం చాటేసే ఈ రోజుల్లో.. ఈ అమెరికా అబ్బాయి ప్రేమించిన ప్రియురాలి కోసం మన దేశ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు.