- ఒక ఎడిషన్‌లో అత్యధిక మెడల్స్‌తో రికార్డు
- చివరి రోజు మరో నాలుగు పతకాలు సొంతం
యుగీన్ : వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన అగ్రరాజ్యం అమెరికా పతకాల్లో టాప్ లేపింది. రికార్డు స్థాయిలో 13 గోల్డ్ సహా 33 మెడల్స్ కైవసం చేసుకొని ఓవరాల్ టీమ్ చాంపియన్స్‌గా నిలిచింది. ఇందులో 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఒక ఎడిషన్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా యూఎస్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. 2017లో సాధించిన 30 పతకాల రికార్డును మెరుగు పరుచుకుంది. ఇథియోపియా 4 గోల్డ్, 4 సిల్వర్, 2 బ్రాంజ్‌లతో 10 మెడల్స్‌తో రెండో స్థానంలో నిలవగా.. జమైకా రెండు గోల్డ్, 7 సిల్వర్ , 1 బ్రాంజ్‌తో 10 పతకాలు నెగ్గి మూడో ప్లేస్ సాధించింది. ఈ పోటీల్లో అమెరికా మూడు ఈవెంట్లను (మెన్స్ 100మీ. మెన్స్ 200మీ. మెన్స్ షాట్ పుట్) క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.
చివరి రోజూ అదే జోరు
పోటీల చివరి రోజైన ఆదివారం (ఇండియా టైమ్ ప్రకారం సోమవారం) అమెరికా 3 గోల్డ్, ఒక సిల్వర్ సాధించింది. విమెన్స్ 800మీ. ఈవెంట్‌లో ఎతింగ్ ము గోల్డ్ నెగ్గింది. 20 ఏండ్ల ఈ యువ అథ్లెట్ ఫైనల్ రేసు 1:56.30 సెకండ్లతో పూర్తి చేసింది. బ్రిటన్‌కు చెందిన కీలీ హొడ్కిన్సన్ (1:56.38సె.) సిల్వర్, కెన్యాకు చెందిన మేరీ మొరా (1:56.71 సె.) బ్రాంజ్ నెగ్గారు. మెన్స్ పోల్ వాల్ట్ లో నిల్సెన్ క్రిస్టోఫర్ (5.94మీ.) సిల్వర్ గెలిచాడు. స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్టర్ ఆర్మండ్ డుప్లాంటిస్ 6.21 మీటర్లతో తన పేరిటే ఉన్న వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ గోల్డ్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో స్వీడన్‌కు ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం.
రిలేలో డబుల్ ధమాకా
మెన్స్, విమెన్స్ 4x400 మీటర్ల రిలేలో విజేతగా నిలిచిన అమెరికా డబుల్ ధమాకా మోగించింది. తొలుత మెన్స్ రిలేలో యూఎస్ టీమ్ 2:56.17 సె. టైమింగ్‌తో పోడియం ఫినిష్ చేసింది. ఇక, విమెన్స్ 4x400 మీటర్ల రిలేలో స్టార్ రన్నర్ సిడ్నీ మెక్‌లాగ్లిన్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆతిథ్య జట్టు గేమ్స్‌కు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చింది. రెండు రోజుల కిందట 400 మీ. హర్డిల్స్‌లో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన మెక్‌లాగ్లిన్ రిలేలో చివరి లెగ్‌లో మెరుపు వేగంతో పరుగెత్తి జట్టుకు 33వ మెడల్ అందించింది. ఈ రేస్‌ను అమెరికా 3:17.79 టైమింగ్‌తో పూర్తి చేసింది. రిటైర్మెంట్ పక్కనబెట్టిన అమెరికా లెజెండ్ అలీసన్ ఫెలిక్స్ ఈ రిలే హీట్స్‌లో పోటీ పడి జట్టును ఫైనల్ చేర్చింది. ఫైనల్లో ఆమె బరిలోకి దిగకున్నా పతకంలో భాగమైంది. దీంతో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రికార్డు స్థాయిలో 20 మెడల్స్‌తో అలీసన్ కెరీర్‌ను ముగించింది.
