- నిత్యం సగటున 250 మంది బాధితులు
- గత నెలలో 7,500 మంది నుంచి రూ.158 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
- రెండేండ్లలో 96,407 మంది బాధితులు
- రూ.1,319 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు
- రూ.534 కోట్లు ఫ్రీజ్ చేసిన సీఎస్‌బీ, 393 మంది అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారినపడుతున్నారు. సైబర్ నేరస్తుల వలలో చిక్కి రోజూ రూ.5.5 కోట్లకు పైనే పోగొట్టుకుంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 7,500 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.158 కోట్లు కోల్పోయారు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, ఫేక్ కస్టమర్ కేర్, డిజిటల్ అరెస్టులు, లోన్ ఫ్రాడ్ వంటి నేరాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. గత రెండేండ్లలో చూస్తే రాష్ట్రంలో నమోదైన ఈ తరహా ఘటనల్లో 96,407 మంది బాధితులు రూ.1,319 కోట్లు కోల్పోయారు. డార్క్ వెబ్, సోషల్ మీడియా, ఈ–కామర్స్ వెబ్ సైట్లు సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్‌లైన్ లింకులు పంపించి, ట్రాప్ చేస్తున్నారు. బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్, వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పొందవచ్చంటూ లింకులు పంపుతున్నారు. మాయమాటలను నమ్మి సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో బాధితులు 90 శాతం విద్యావంతులే ఉంటున్నారు. కాగా, సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా మోసపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అన్నీ తెలిసిన పోలీసు ఆఫీసర్లు కూడా ఊహించని రీతిలో సైబర్ మోసాలకు గురవుతున్నారు.
ఫెడెక్స్ కొరియర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దోపిడీ
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో సిటీలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. డార్క్ వెబ్ సైట్లలో కొనుగోలు చేసిన వారి ఫోన్ నంబర్స్, ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్స్‌తో వరుస మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, కస్టమ్స్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైం పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ఫెడెక్స్ కొరియర్‌లో వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్, బంగారం, నిషేధిత వస్తువులు ఉన్నాయని ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ అర్ధరాత్రి గంటల తరబడి వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ.. అందినకాడికి దోచేస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్స్
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాలను కట్టడి చేయడంతోపాటు బాధితులకు అండగా నిలిచింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్‌ఎస్).. 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. గోల్డెన్ అవర్ లో అందిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్చేస్తున్నారు. గత రెండేండ్లలో రూ.534 కోట్లు ఫ్రీజ్ చేయగా.. లోక్ అదాలత్ ద్వారా 29,273 మంది బాధితులకు రూ.183 కోట్లు రిఫండ్ చేశారు. మిగతా మొత్తం కూడా సంబంధిత ఫిర్యాదుల ఆధారంగా బాధితుల అకౌంట్లకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 513 సైబర్ నేరాలకు సంబంధించి 393 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన 2,901 కేసులతో వారితో లింకులు ఉన్నట్లు సీఎస్‌బీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. దీంతోపాటు సైబర్ నేరాలకు సంబంధించి 9,431 సిమ్ కార్డులు, 8,856 ఐఎంఈఐ నంబర్లను సీఎస్‌బీ బ్లాక్ చేసింది.
