ఆ శిథిల గ్రామం ఇప్పుడు కళకళలాడుతోంది

ఆ శిథిల గ్రామం ఇప్పుడు కళకళలాడుతోంది

మనుషులకు, జంతువులకు ట్రీట్మెంట్​ చేసే డాక్టర్స్​, హాస్పిటల్స్​ గురించి అందరికీ తెలుసు. కానీ, ఒక ఊరికి తగిలిన గాయాల్ని మాన్పుతున్న హోటల్​ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? ... ఆగండాగండి. అసలు ఊరికి గాయాలేంటి? వాటికి హోటల్​ ట్రీట్మెంట్​ ఇవ్వడమేంటి? అనుకుంటున్నారా? ఆ సంగతులేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి. 

గెలుపు, ఓటములు ఎవరివైనా యుద్ధం చేసే విధ్వంసానికి బాధితులు మాత్రం రెండు వైపులా ఉంటారు. ఆ గాయాలు కూడా అంత సులువుగా తగ్గిపోవు. అలాంటి మానని గాయాల శిథిల గ్రామమే లిచేకో పెట్రోవో సెలో. ఇది క్రొయేషియాలోని లీకో రీజియన్​లో ఉంది. బోస్నియా అండ్ హెగ్జగోవినా దేశానికి సరిహద్దులో ఉండే ఈ ఊరు ఏండ్ల తరబడి జరిగిన ఎన్నో యుద్ధాల్లో తీవ్రంగా దెబ్బతింది. సెర్బియన్లు, క్రొయేషిన్లు, బోస్నియన్లు ఉండే ఆ ఊరిలో జనం వాళ్లలోవాళ్లు గొడవలు పడి ఊరొదిలి వెళ్లిపోయారు. మరోవైపు బాల్కన్​ వార్స్​​ నుంచి యుగోస్లేవియా సివిల్​వార్​ వరకు ఫిరంగులు, మోర్టార్లు, తుపాకీలు ఈ గ్రామంపై ప్రతాపం చూపించాయి. చాలా ఇండ్లను పడగొట్టాయి. మరికొన్నింటిపై తమ గుర్తులు వేశాయి.  అంతేకాదు, గ్రామస్తుల్లో వందలాది మందిని తట్టాబుట్టా సర్దుకొని వలస వెళ్లేలా చేశాయి. చివరికి వంద మందిని మాత్రమే మిగిల్చాయి. 



ఆమె ఆలోచనతో..   

లిచేకో పెట్రో సెలోకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్లిట్విచ్ లేక్స్​ నేషనల్​ పార్క్​. ఇది క్రొయేషియాలోని బ్యూటీఫుల్​ టూరిస్ట్ ప్లేస్​లలో ఒకటి. దీన్ని చూడ్డానికి ఏటా టూరిస్ట్​లు వేలల్లో వస్తుంటారు. వాళ్ల కోసం దగ్గరలో ఒక ఫోర్​స్టార్​ హోటల్​ కట్టాలనుకుంది ఆండ్రిజా చెర్నోవిచ్​. మంచి స్థలం కోసం వెతుకుతుంటే లిచేకో పెట్రో సెలో కనిపించింది. యుద్ధం చేసిన గాయాలు ఆ ఊరిలో ఎక్కడ చూసినా కనిపించాయి ఆమెకు. అది చూసి చాలా బాధపడింది. ఎలాగైనా ఆ ఊరిని బాగు చేయాలనుకుంది.  వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తాను కట్టబోయే హోటల్​ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత ఆ ఊళ్లోని ఇండ్లను బాగుచేయడానికి వాడాలనుకుంది. తన ఆలోచనను ‘హ్యాపీ టూర్స్​’ కంపెనీ ఓనర్​కు చెప్పి హోటల్​ కట్టడానికి అవసరమైన డబ్బులో కొంత అప్పు అడిగింది. ఆయనకు ఆమె ఐడియా నచ్చి డబ్బు ఇవ్వడంతోపాటు హోటల్​లో పార్ట్​నర్​గా మారాడు. దాంతో 2019లో 58 రూమ్​లతో లైరా హోటల్​ మొదలైంది. 

లైరా రాకతో..



ఘోస్ట్​ విలేజ్​గా ముద్ర పడిన లిచేకో పెట్రో సెలోకు లైరా రాకతో మళ్లీ కళ వచ్చింది. ఊళ్లో పాడుపడిన ఇండ్లను ఒకటొకటిగా బాగు చేయడం మొదలుపెట్టింది ఆండ్రిజా చెర్నోవిచ్. ఆ పనిలో ఆమెకు హోటల్​ సేల్స్ మేనేజర్​ శాంజా బుబాలో, రిసెప్షనిస్ట్​ అనా రుకావినా, సామాజిక కార్యకర్త, టూరిస్ట్​ గైడ్​ శాంజా లెకా తోడయ్యారు. వీళ్లు మొదట హోటల్​కు దగ్గరలో ఉన్న ఒక ఇంటిని ఎంచుకున్నారు. ఒక వృద్ధ జంట ఆ ఇంట్లో ఉంటున్నారు. చెర్నోవిచ్​ మొదట ఆ ఇంట్లోని ఒక గదిలో అద్దెకు దిగింది. తర్వాత తన ఆలోచనను చెప్పి, వాళ్లను ఒప్పించింది. ఆ ఇంటిని బాగు చేయించింది. పని మొదలయ్యాక మిగిలిన గ్రామస్తులు కూడా తలో చేయి వేశారు. అలా మూడేండ్లలో ఆ ఊళ్లోని పదికిపైగా ఇండ్లను బాగుచేయించింది చెర్నోవిచ్. ఆ విషయం తెలిసి ఊరొదిలిపెట్టి వెళ్లిన వాళ్లలో కొందరు మళ్లీ గ్రామానికి వచ్చారు. కేవలం పాడుబడిన ఇండ్లను బాగు చేయడంతోనే చెర్నోవిచ్ ఆగిపోలేదు. ఆ ఊరివాళ్లకు పని కూడా కల్పించాలనుకుంది.

చేనేతకు చాలా ఫేమస్​...
ఆ ఊరు చేనేతకు చాలా ఫేమస్​. వాళ్లకోసం అక్కడ 2004లో ‘టారా కమ్యూనిటీ అసోసియేషన్’​ పేరుతో ఒక ఆర్గనైజేషన్​ కూడా ఏర్పడింది. వెంటనే వాళ్లను కలిసింది చెర్నోవిచ్​. వాళ్ల ప్రొడక్ట్స్​ను హోటల్​లోని ఒక గదిలో పెట్టి టూరిస్ట్​లకు అమ్మే అవకాశం కల్పించింది. దాంతో ఇప్పుడు ఆ ఊరు మళ్లీ కళకళలాడుతోంది. ‘లైరా’కు హోటల్​గా కాకుండా గ్రామాన్ని బాగుచేస్తున్న హాస్పిటల్​గానూ పేరొచ్చింది. అంతేకాదు, ఇటీవలే 230వ  పుట్టినరోజు జరుపుకున్న ఆ ఊరి వేడుకలకు ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామస్తులు మళ్లీ వచ్చారు. తమ ఊరిని బాగుచేస్తున్న చెర్నోవిచ్​ను, లైరా హోటల్​ సిబ్బందిని మెచ్చుకున్నారు. అంతేకాదు, గ్రామం కోసం తాము కూడా కష్టపడేందుకు సిద్ధమయ్యారు. ఏదైనా మంచి పని మొదలుపెడితే దానికి సాయంచేసే చేతులు కూడా కలిసొస్తాయి అనేందుకు ఇదే రుజువు.