స్టాచ్యూ మ్యాన్.. అబ్దుల్ అజీజ్.. రోజుకు 6 గంటలు ఏమాత్రం కదలకుండా నిలబడటమే ఆయన ఉద్యోగం !

స్టాచ్యూ మ్యాన్.. అబ్దుల్ అజీజ్.. రోజుకు 6 గంటలు ఏమాత్రం కదలకుండా నిలబడటమే ఆయన ఉద్యోగం !

ఎవరైనా ఏమాత్రం కదలకుండా ఒకేచోట ఎంతసేపు ఉండగలరు? కన్ను అసలే గిలపకుండా ఎంతకాలం ఉండగలరు? ముక్కుపై ఈగ వాలినా తోలకుండా ఎంతని సహిస్తాం? అనే ప్రశ్నలకు ఇంతసేపు, అంతసేపు అని నిమిషాల లెక్క చెప్పొచ్చు. కానీ, గంటల కొద్దీ ఉంటామని ఎవరూ చెప్పరు. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. అయితే, అలా కదలక, మెదలక చెక్కిన విగ్రహంలా రోజూ ఆరు గంటల పాటు నిలబడి ఉండే మనిషి ఒకరు ఉన్నారు. ఆ వింతైన వ్యక్తి పేరు అబ్దుల్ అజీజ్. సుమారు 40 ఏళ్ల పాటు విరామం లేకుండా అలా నిలబడడమే ఆయన ఉద్యోగం.

చెన్నైలోని వీజీపీ గోల్డెన్ బీచ్ గార్డెన్​ను సందర్శించిన వాళ్లకు ఈ నిశ్చల మనిషి దర్శనం అయ్యే ఉంటుంది. సముద్ర తీరాన ఉన్న ఈ గార్డెన్ ప్రధాన ద్వారానికి రెండు వైపులా అచ్చం ఏనుగు ముఖాల్లా కనబడే బొమ్మలు ఉంటాయి. లోపల అడుగు పెట్టగానే వరుసగా నాట్య భంగిమల్లో ఉన్న యువతుల విగ్రహాలు కనబడతాయి. ఎన్నో సినిమా పాటల్లో మనం చూసినవే అవి. వాటిని దాటాక వచ్చే విశాల ప్రాంగణంలో రాజభటుని వేషంలో ఉన్న బొమ్మలాంటి మనిషి ఎదురుపడతాడు. 

ఎవరినీ పట్టించుకోకుండా తదేకంగా చూస్తున్న ఆయనను చూడగానే ఒక్కసారిగా విగ్రహమేనేమో అని భ్రమపడతారు సందర్శకులు. ఆయన  పక్కన ఇంగ్లీష్ లో ‘స్టాచ్యూ మ్యాన్’ అనే బోర్డు ఉంటుంది. ఎవరైనా అతన్ని చూసిన వెంటనే ‘ఇలా ఎలా ఉండగలడు?’ అని ఆశ్చర్యంతో కాసేపు అలాగే బొమ్మలా ఉండిపోతారు. తేరుకున్నాక ఆ పక్కనే ఓ ప్రకటన కనబడుతుంది. అందులో ఆయనలో చలనం తెచ్చిన వారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని ఉంటుంది. అది చూసి అబ్దుల్‌‌‌‌ని ఎలాగైనా కదిలేలా చేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు.

నవ్వించేందుకు జోకులు పేల్చుతారు. వింతగా గంతులు వేస్తారు. బిగ్గరగా నవ్వుతారు. చివరకు ఆయన దగ్గరగా వెళ్లి కళ్లలో వేలు పెట్టినంత పని చేస్తారు. అలా ప్రయత్నించినవారు లక్షపైనే ఉండొచ్చు. విచిత్రమేమిటంటే ఆ ప్రైజ్ మనీని ఒక్కరు కూడా గెలవలేకపోయారు. వారి చేష్టలను చూసి, మాటలను విని ఎంతో నిబ్బరంగా తట్టుకొని ఉండడం మామూలు విషయం కాదు. పాతికేళ్ల ప్రాయం నుంచి అలా నిలబడడం మొదలుపెట్టిన అజీజ్‌‌‌‌కు ఇప్పుడు వయసు పైబడింది. కానీ, ఆయన అచల యజ్ఞాన్ని మాత్రం ఎవరూ భంగం చేయలేకపోయారు. చివరకు సినిమాల్లోని కమెడియన్లు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. సినీ యాక్షన్ డైరెక్టర్ కనల్ కణ్ణన్ ఫైటింగ్ ఫోజులతో భయపెట్టినా అజీజ్ బెదరలేదు. అందుకు మెచ్చి కణ్ణన్  కరెన్సీ నోట్ల దండతో అజీజ్​ను సత్కరించారు.

బతుకుదెరువు కోసం చెన్నై వచ్చిన అబ్దుల్ అజీజ్1984లో వీజీపీ గోల్డెన్ బీచ్‌‌‌‌లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. దాని యజమాని వీజీ పన్నీర్ దాస్ బ్రిటన్ వెళ్లినప్పుడు లండన్​లోని బకింగ్ హామ్ ప్యాలెస్ దగ్గర కదలకుండా నిలబడే సైనిక వేషధారులను చూశాడు. నిశ్చలంగా నిలబడేవారి డ్యూటీ అక్కడ రోజుకు రెండు గంటలు మాత్రమే. ఆ తర్వాత మరొకరు ఆ బాధ్యత తీసుకుంటారు. 

అలా బొమ్మలా నిలబడే మనిషిని తన గోల్డెన్ బీచ్​లో ఏర్పాటు చేయాలనే ఆలోచన దాస్‌‌‌‌కు వచ్చింది. తన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డులను పిలిచి ‘కదలకుండా నిలబడితే నెలకు పదివేల జీతం ఇస్తాను’ అని ప్రకటించారు. అందుకు ఒప్పుకుని అయిదుగురు ముందుకు వచ్చారు. వారికి ట్రైనింగ్​ ఇప్పించి టెస్ట్‌‌‌‌ చేయగా అజీజ్ ఒక్కడే ఎంపికయ్యాడు. ఆ పని మరొకరికి సాధ్యపడకపోవడంతో రోజుకు 6 గంటలు తానే నిలబడాల్సి వచ్చింది. అలా కాలమూ గడిచిపోయింది.  

బ్రేక్‌‌‌‌‌‌‌‌ టైంలో అజీజ్‌‌‌‌‌‌‌‌ను కలిసిన జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లు మొదట అడిగే ప్రశ్న ఒక్కటే.. ‘ఈ సాధనపై నీకెలా పట్టు దొరికింది’ అని. అందుకు అతను ‘మొదట్లో నా వల్ల కాదనే అనుకున్నాను. యజమాని మాట వినకపోతే ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ప్రయత్నించాను. ఆ భయంతోపాటు, పట్టుదల కూడా పెరిగింది. ప్రజలకు వినోదం పంచడం చూశాక వృత్తిని చాలెంజ్‌‌‌‌‌‌‌‌గా తీసుకోక తప్పలేదు. నా ఫ్యామిలీ కూడా నాకు బాగా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. రోజూ యోగా, వ్యాయామం చేయడం, నడవడం, ప్రశాంతంగా పడుకోవడం నా దినచర్యగా మారింది. యోగాసాధన వల్లే నరాల, కండరాల నొప్పి అదుపులోకి వచ్చింది. నిలబడ్డప్పుడు మనసులోకి మరో ఆలోచన రాకుండా పనిపైనే ఏకాగ్రత పెట్టడం కూడా దాని వల్లే సాధ్యపడింది’ అంటాడు అజీజ్.

కరోనా లాక్ డౌన్ వల్ల 2020లో గోల్డెన్ బీచ్ మూతపడడంతో అజీజ్ తన గ్రామానికి వెళ్లిపోయాడు. వయసు మీద పడడంతో వృత్తి భారమైంది. ‘ఉద్యోగం మానేస్తాను’ అని 2022లో ఆయన గల్ఫ్ న్యూస్​కు ఇచ్చినదే ఆఖరి ఇంటర్వ్యూ. దశాబ్దాలపాటు నిలబెట్టుకున్న ఆయన ప్రతిభకు సందర్శకుల ప్రశంసలు తప్ప మరే సత్కారం లభించలేదు. పట్టుదలకు పర్యాయపదంగా పిల్లలకు పాఠ్యాంశంగా మారాల్సిన ఆయన అనామకుడిగానే మిగిలిపోయాడు.

బద్రి నర్సన్: 9440128169

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com