ముంబైలో పుట్టి, పెరిగారు అనీష పిళ్లై, దీపక్ గుప్తా. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదివిన వీళ్లిద్దరూ మూడేండ్ల కిందటి వరకు పేరున్న కంపెనీలకి కన్సల్టింగ్ సర్వీస్‌లు అందించేవాళ్లు. అయితే ఓరోజు వీళ్లిద్దరూ రోడ్డుపై వెళ్తుంటే అటుగా ఓ కుక్క ఏడుస్తూ కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే.. దాని కాళ్లకి గుచ్చుకున్న రాళ్లు, గాజు ముక్కలు కనిపించాయి. ఆ కుక్క బాధ చూశాక రెండుమూడు రోజులు నిద్రపట్టలేదు అనీష, దీపక్లకి. వాటి బాధ తగ్గించడానికి ఏదైనా చేయాలనుకున్నారు. చాలా ఆలోచించి వాటి కోసం షూ తయారుచేయాలని డిసైడ్ అయ్యారు.
క్షణాల్లో అమ్ముడయ్యాయి
ప్రొడక్ట్ డిజైనింగ్, మార్కెటింగ్‌కి సంబంధించి ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ లేదు. అయినా సరే.. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టారు. వేలమంది పెట్ పేరెంట్స్‌ని కలిశారు. అయితే, పెట్స్ కోసం షూ కొంటారా? అని ఎవర్ని అడిగినా విచిత్రంగా చూశారు. కానీ, అందరూ చెప్పింది పెట్స్ కాళ్లకి ఏదైనా దెబ్బతగిలితే చూడలేకపోతున్నామనే. దాంతో మరో ఆలోచన లేకుండా ముందుకెళ్లారు. ప్రోటోటైప్‌గా పెట్స్ పాదాలని కవర్ చేసేలా నేచురల్ రబ్బర్‌తో వాటర్ ప్రూఫ్ షూ తయారుచేశారు. అవి అనుకున్నట్టు రావడంతో అదే ఫార్ములాతో మరో వంద షూస్ తయారుచేశారు. వాటిని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే.. క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మళ్లీ స్టాక్ ఎప్పుడొస్తుందంటూ వందల మెసేజ్‌లు వచ్చాయి. రోజురోజుకి ఆర్డర్ల సంఖ్య పెరగడంతో షూ అమ్మేందుకు జూఫ్పెట్. కామ్ పేరుతో వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు.
ధైర్యం కోల్పోలేదు
ఆర్డర్లకి తగ్గట్టే షూల తయారీకి అవసరమైన ఎక్విప్మెంట్, మెటీరియల్ తెప్పించారు. ప్రొడక్షన్ యూనిట్ కోసం ఒక ఫ్యాక్టరీని అద్దెకి తీసుకున్నారు. కానీ, అంతలోనే కొవిడ్ వల్ల లాక్డౌన్ వచ్చింది. అలాగని ధైర్యం కోల్పోలేదు వీళ్లు. ఇంట్లోనే డిఫరెంట్ డిజైన్స్‌లో షూ తయారుచేశారు. ప్యాకేజింగ్, షిప్పింగ్ అన్నింటినీ ఇంటి నుంచే మేనేజ్ చేశారు. ప్రస్తుతం షూలలో.. క్యాజువల్, ప్లాప్, గ్రిప్స్, ఎథిక్ అనే నాలుగు మోడల్స్ తయారుచేస్తున్నారు వీళ్లు. ఎనిమిది సెట్లు ఉన్న షూల ధర 799 రూపాయల నుంచి మొదలవుతుంది. పెట్స్ పాదాల సైజుని బట్టి రేటు పెరుగుతుంటుంది. పెట్స్ నడక తీరు, వాటి పాదాల సైజుని బట్టి షూ తయారుచేస్తారు. ఇవి వేసుకోవడం వల్ల పాదాలను ఇన్ఫెక్షన్లు, పేల సమస్య కీళ్లనొప్పులు దరిచేరవని చెప్తున్నారు అనీష, దీపక్. మనుషులైనా, జంతువులైనా.. నొప్పి ఒక్కటే. అయితే, మనకి చెప్పుకోవడానికి చుట్టూ వందలమంది ఉంటారు. కానీ, వాటికి ఆ అవకాశం కూడా లేదు. అందుకే వాటి సేఫ్టీ గురించి మరింత ఆలోచించాలి అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే జూఫ్పెట్స్ని తీసుకొచ్చాం. ఇప్పటివరకు వాటికోసం పన్నెండువేల కస్టమైజ్డ్ షూ తయారుచేశాం. రెపీటెడ్ కస్టమర్స్ ముప్పై శాతం మంది వరకు ఉన్నారు. ప్రతి నెలా ఇరవై ఐదు శాతం సేల్స్ పెరుగుతున్నాయి. ఈ ఇన్స్పిరేషన్తో మరిన్ని డిజైన్స్తీసుకురావాలనుకుంటున్నాం అంటున్నారు
