- ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో పెంచిన జీతాల జీఓ
- రెండు నెలలుగా నిలిచిన వేతనాలు
పెద్దపల్లి, వెలుగు: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆగమవుతున్నారు. రెండు నెలలుగా రెగ్యులర్ జీతాలు అందక, ఇప్పటివరకు పెంచిన జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ అంగన్వాడీల వేతనాలు పెంచుతామని జీఓ విడుదల చేసింది. 6 నెలలు గడిచినా కొత్త వేతనాలు అమల్లోకి రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, హెల్పర్ ఉండగా, మినీ కేంద్రాల్లో టీచర్ మాత్రమే ఉంటారు. ఖాళీలు మినహాయిస్తే రాష్ట్రంలో 58 వేల మంది టీచర్లు, హెల్పర్లు డ్యూటీ చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. పిల్లలు, గర్భిణులకు సర్కారు సకాలంలో పోషకాహారం పంపిణీ చేయకపోవడంతో కొన్నిసార్లు అంగన్వాడీ టీచర్లే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే వంట గ్యాస్‌కు సంబంధించి టీచర్లే ఖర్చు భరిస్తున్నారు. ఇలాంటి వాటికి సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో అటు కుటుంబం గడవక.. ఇటు అంగన్వాడీల నిర్వహణకు సైతం అవస్థలు పడుతున్నారు.
కొత్త వేతనాలు ఇచ్చేదెప్పుడు?
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఆగస్టులో వేతనాలను పెంచింది. అంగన్‌వాడీ టీచర్‌కు రూ.10,500 నుంచి రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌కు రూ.6,000 నుంచి రూ.7,800కు పెంచారు. వీటిని జులై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నేటికీ కొత్త జీతాలు మాత్రం అందడం లేదు. కొత్త జీతాల జీఓ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో పడింది. కొత్త వేతనాల అమలుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్లే లేటవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అంగన్వాడీ సెంటర్లకు సప్లయ్చేసే ఫుడ్బాధ్యతలను ఆర్టీసీ కార్గోకు అప్పగించడానికి ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల అంగన్వాడీ టీచర్లకు మరింత బర్డెన్ పెరుగుతుందని టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, బకాయిలతోపాటు, ప్రస్తుత వేతనాలను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు.
ఏరియర్స్‌తో కలిపి చెల్లించాలె
ప్రభుత్వం ప్రకటించి నట్లుగా జులై నుంచి అమలు కావాల్సిన వేతనాలను ఏరి యర్స్రూపంలో ప్రస్తుత వేతనాలతో కలిసి ఇయ్యాలి. ఆరు నెలలు గడిచినా కొత్త వేతనాలపై ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇతర డిపార్ట్మెంట్లకు కొత్త వేతనాలు అమల్లోకి వచ్చినా అంగన్వాడీలను మాత్రం సర్కారు నిర్ల క్ష్యం చేస్తోంది. వెంటనే కొత్త వేతనాలు వి డుదల చేసి అంగన్వాడీలను ఆదుకోవాలి.-కలవేన స్వరూప, అంగన్వాడీ టీచర్, పెగడపల్లి, పెద్దపల్లి జిల్లా
సర్కారు హామీని నిలుపుకోవాలి
రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చినట్లుగా సవరించిన వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే అంగన్వాడీ సెంటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విరమించుకోవాలి. అంగన్వాడీలకు ఆహారపదార్థాలు ఆర్టీసీ కార్గోద్వారా సరఫరా చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అమలు చేయాలని చూస్తే ఉద్యమిస్తాం. - జ్యోతి, టీఎస్ అంగన్వాడీ యూనియన్ సహాయ కార్యదర్శి
