హైదరాబాద్, వెలుగు: “అంగన్‌వాడీ విద్యను పటిష్టం చేయడం ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రైమరీ బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది” ఇవి రెండ్రోజుల కింద మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పిన మాటలు. కానీ ప్రైమరీ స్కూళ్లలోకి అంగన్‌వాడీలను మార్చడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. స్కూల్‌కు సెంటర్‌కు మధ్య దూరం, బడుల్లో గదుల కొరతే ప్రధాన కారణం. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.
అద్దె భవనాల్లోనే 12 వేల అంగన్‌వాడీలు..
రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 12,219 సెంటర్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మరో 11,185 సెంటర్లకు సొంత భవనాలుండగా, మిగిలిన అంగన్‌వాడీలు కిరాయి లేకుండా కమ్యూనిటీ హాల్స్, ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. ప్రైమరీ స్కూళ్లలో అంగన్‌వాడీలు నిర్వహించాలని సర్కారు మూడేండ్ల కింద నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే కొత్త భవనాలనూ ప్రైమరీ స్కూల్ ప్రాంగణాల్లోనే నిర్మిస్తున్నారు. అద్దె భవనాల్లోని కేంద్రాల్లో సౌలతులు లేకపోవడంతోపాటు అద్దె భారం కూడా సర్కారుపై పడుతుండటంతో వాటిని సర్కారు బడుల్లోకే మార్చాలని అనుకుంటున్నారు.
1,600 అంగన్‌వాడీల షిఫ్టింగ్‌కు ఓకే..
అద్దె భవనాల్లోని 12 వేలకుపైగా అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లకు షిఫ్ట్ చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం స్కూల్‌కు, సెంటర్‌కు అర కిలోమీటర్‌లోపు దూరం ఉన్న వాటిని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించారు. ఇలాంటి 1,600 కేంద్రాలు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వీటిని మరోసారి ఎంఈవోలు పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. వీటిలోనూ కొన్ని ప్రైమరీ స్కూళ్లలో గదుల కొరత ఉంది. దీంతో ఈ సంఖ్య కూడా తగ్గే అవకాశముంది. ఇవి కాకుండా అద్దె భవనాల్లోని మిగిలిన అంగన్‌వాడీలు స్కూళ్లకు దూరంగా ఉండటంతో పాటు స్కూల్స్‌లో గదుల కొరత ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వాటిని ఏం చేయాలనే దానిపై చర్చించడానికి అధికారులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. జిల్లాల్లో స్కూల్ ఎడ్యుకేషన్, ఐసీడీఎస్ అధికారులు అంగన్‌వాడీ, ప్రైమరీ స్కూళ్లను పరిశీలించి, రిపోర్టు సర్కారుకు పంపాలని ఆదేశించినట్టు సమాచారం. రిపోర్టు ఆధారంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ముందుగా ఈ 1,600 అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లకు షిఫ్ట్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. అయితే పూర్తిస్థాయిలో అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లకు షిఫ్ట్ చేయడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు చెప్తున్నారు.
