సెప్టెంబర్ నెలలో .. కాంగ్రెస్​ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

సెప్టెంబర్ నెలలో .. కాంగ్రెస్​ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
  • కాంగ్రెస్​ అభ్యర్థుల ప్రకటన.. వచ్చే నెలలో!
  • టికెట్ ​అప్లికేషన్​ విధివిధానాలకు సబ్​ కమిటీ ఏర్పాటు
  • చైర్మన్​గా దామోదర రాజనర్సింహ
  • ఈ నెల 17 నాటికి విధివిధానాలు ఖరారు
  • 18 నుంచి 25 వరకు అప్లికేషన్లకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే అభ్యర్థులను వచ్చే నెలలో ప్రకటించేందుకు కాంగ్రెస్​ పార్టీ  రెడీ అయింది. ఈ మేరకు విధివిధానాలపై కసరత్తు ప్రారంభించింది. టికెట్​ అప్లికేషన్​ విధివిధానాలకు, అప్లికేషన్​ ఫీజుకు సంబంధించి సబ్​ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్​కమిటీకి చైర్మన్​గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సభ్యులుగా ఏఐసీసీ సెక్రటరీ రోహిత్​ చౌదరి, మహేశ్​కుమర్​ గౌడ్​ను నియమించింది. సోమవారం గాంధీభవన్​లో కాంగ్రెస్​ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్​ కమిటీ  సమావేశమయ్యాయి. 


ఎన్నికల కమిటీ చైర్మన్​ రేవంత్​ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​ మురళీధరన్, సభ్యులు జిగ్నేశ్​ మేవానీ, బాబా సిద్ధిఖ్​తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల లిస్ట్​, ఎంపిక విధావిధానాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. సమావేశం అనంతరం పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. 17వ తేదీ వరకు విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. 18వ తేదీ నుంచి 25 వరకు డీడీ రూపంలో ఫీజు చెల్లించి ఆశావహులు అప్లికేషన్​ ఇవ్వాలన్నారు. టికెట్​ కావాలనుకునేవారు గాంధీభవన్​లో అప్లయ్​ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్​ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. 

అప్లికేషన్లు పరిశీలించి ఎలక్షన్​ కమిటీకి పంపిస్తామని, ఆ తర్వాత స్క్రీనింగ్​ కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. అప్లయ్​ చేసుకున్నోళ్లందరికీ టికెట్​ ఇవ్వడం కుదిరేపని కాదన్నారు. టికెట్ల విషయంలో సర్వేలను ప్రామాణికంగా తీసుకున్నా.. పూర్తిగా వాటిపైనా ఆధారపడలేమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఎలక్షన్​ కమిటీదే కీలక పాత్రని తెలిపారు. అభ్యర్థుల స్క్రీనింగ్​ పూర్తయ్యాక లిస్టును పార్టీ సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ, కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీకి పంపిస్తామని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, షబ్బీర్​ అలీ, జానా రెడ్డి, బలరాం నాయక్​, దామోదర రాజనర్సింహ, సంపత్​కుమార్​, వంశీచంద్​ రెడ్డి, అంజన్​ కుమార్​ యాదవ్​, రేణుకా చౌదరి, జీవన్​ రెడ్డి, రోహిత్​ చౌదరి, సీతక్క, జగ్గారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సునీతా రావు, శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నన్ను అడగకుండా నియామకమా: పొన్నాల!

సమావేశంలో పీసీసీ చీఫ్​ రేవంత్​ తీరుపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జనగామ డీసీసీ  ప్రెసిడెంట్​ నియామకం విషయంలో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. పీసీసీ మాజీ చీఫ్​ను అయిన తనను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా ఎట్ల నియమిస్తారని ప్రశ్నించారని తెలిసింది. ఎవరెవరినో కలుస్తున్నారుగానీ.. తనను మాత్రం ఎందుకు కలవడం లేదని రేవంత్​పై పొన్నాల అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 

జనరల్​ సీట్లపైనా చర్చ

జనరల్​ సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు కేటాయించే విషయంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. జనరల్​ సీట్లలో వారికి అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు కన్సాలిడేట్​ అయ్యే అవకాశం ఉందని అన్నట్టు తెలిసింది. బీసీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని స్క్రీనింగ్​ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.  అభ్యర్థులను వీలైనంత తొందరగా ప్రకటించాలని నేతలు డిమాండ్​ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో అభ్యర్థులను లేట్​గా ప్రకటించడం వల్ల ప్రచారం చేసుకోవడానికి టైం లేకుండా పోయిందని, జనాల్లోకి వెళ్లలేకపోయామని చెప్పినట్టు సమాచారం.